BJP Vs TTDP :  తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్​చుగ్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీకి అండగా నిలబడాలని తాను అన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి ఉన్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వదంతులు వ్యాప్తి చేయడం మానుకోవాలని  తరుణ్ చుగ్ మీడియాకు సూచించారు. గురువారం ఢిల్లీలో తరుణ్ చుగ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ సందర్భంలో టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ ఆలోచిస్తున్నదని తరుణ్ చుగ్ అన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ అంశం పొలిటికల్  సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు లేదని, తాను అలా అనలేదని తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు. 


టీడీపీ ఖమ్మం బహిరంగసభ తర్వాత బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలని అంచనాలు


ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పెంచింది. ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించింది. త్వరలో నిజామాబాద్‌లోనూ సభ పెడతామని ప్రకటించారు. అదే సమయంలో అసలు టీడీపీ ఇలా తెలంగాణలో మళ్లీ బల ప్రదర్శన చేయడానికి కారణం .. బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నించడమేనని ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి సహకరిస్తామని.. ఏపీలో తమకు సహకరించాలనే ప్రతిపాదనలు టీడీపీ పెడుతోందని ఇతర పార్టీల నేతలు అంటున్నారు అయితే పొత్తుల అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొత్త టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. 


ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్న  టీ టీడీపీ, తెలంగాణ  బీజేపీ 


నిజానికి తెలంగాణ బీజేపీ కూడా పొత్తుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం లేదు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ అంతర్గతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత షర్మిలకు మద్దతు ప్రకటించడంతో అప్పట్నుంచి పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యాయి. షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే క్లారిటీ లేదు. కానీ షర్మిలపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ నేతలందరూ ఖండించారు. ఈ కారణంగానే పొత్తులపై చర్చ నడుస్తోంది. 


2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ , బీజేపీ


2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ,  బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పట్లో బీజేపీ ఐదు.. టీడీపీ పధ్నాలుగు సీట్లలో గెలిచాయి. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. బీజేపీ బలం పుంజుకుంది. ఇటీవలి కాలంలో అసలు టీడీపీ కార్యాకలాపాలే లేకుండా పోయాయి. మళ్లీ కాసాని జ్ఞానేశ్వర్‌కు టీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పరిస్థితి మారింది. మళ్లీ పొత్తుల చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే అలాంటి ఆలోచనే లేదని రెండు పార్టీలు ప్రస్తుతానికి తేల్చి చెబుతున్నాయి.  


తెలంగాణలో ప్లాన్ మార్చిన బీజేపీ - ఫిబ్రవరి నుంచి చేయబోయేది ఏమిటంటే ?