వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అందరికీ తెలిసిందే. ఆ మధ్య తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయనే బాగా హైలెట్ అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు బీజేపీకి చెందిన కొందరు పెద్దలు తమకు డబ్బు ఆశ చూపి బీఆర్ఎస్ నుంచి బయటికి రావాలని కోరినట్లుగా ఆయన ఆరోపించారు. భారీ డబ్బు తనకు ఆఫర్ చేసినా నైతికతకు కట్టుబడే తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పారు.


ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో ఆయన భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. అయితే, ఆ సెక్యూరిటీ వాడుకొని రోహిత్‌ రెడ్డి తాజాగా చేసిన ఓ పని ఆయన్ని వివాదంలోకి నెట్టింది. దీనికి సంబంధించిన ఒక వీడియో​ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.


తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందితో ఫొటో షూట్ చేయించుకున్నారు. అదే ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన గన్‌మెన్‌లు, వై కేటగిరీ సెక్యూరిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ మారాయి. ఈ వీడియోలో ముందుగా రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన వెనకే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నడుచుకుంటూ ఒక్కొక్కరుగా బయటకు  వస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో ఏకంగా కేజీఎఫ్ మ్యూజిక్ ను వాడుకున్నారు. ఆయన రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది అటూ ఇటూ నడుస్తుండగా మధ్యలో హీరో తరహాలో రోహిత్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ సిబ్బందిని ఇలా వాడుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.