తెలంగాణ గవర్నర్ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం చర్చనీయాంశం అయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన వారి జాబితాను తమిళిసై తిరస్కరించారు. ఈ గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ దగ్గరికి తెలంగాణ ప్రభుత్వం జాబితా పంపించింది. కొంత కాలంగా దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లోనే ఉంచిన గవర్నర్ తాజాగా, నేడు తిరస్కరిస్తూ ప్రభుత్వానికి సమాచారం పంపించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.


రాజకీయాలకు చెందిన వారిని ప్రతిపాదిస్తే తిరస్కరిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారి పేర్లు పంపాలని సూచించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని  గవర్నర్ చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల్లో  వీరిద్దరి పాత్ర గురించి ప్రస్తావించలేదని గవర్నర్ అన్నారు. ఈ విషయంపై లేఖను కూడా పంపారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఏ ఏ కారణాలతో రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో వేర్వేరు లేఖల్లో  గవర్నర్ వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖలు పంపారు.


కేబినెట్ ఆమోదముద్ర


గవర్నర్ కోటాలో  దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలకు ఎమ్మెల్సీ  పదవులకు నామినేట్ చేస్తూ ఈ ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసులను తాజాగా తిరస్కరించారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.  


రాష్ట్రంలో ఎందరో అర్హులున్నారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. అర్హులైన వారి పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తే ఆమోదం తెలుపుతానని స్పష్టం చేశారు. 


గతంలో  కూడా పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిఫార్సును కూడా అప్పట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య మరింత దూరం పెంచింది.