కేసీఆర్ ప్రభుత్వ హయాంలో.. తెలంగాణ రాష్ర్టంలో వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయింది. కాళేశ్వరం లాంటి బాహుబలి ప్రాజెక్టుతోపాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తికావడంతో... బీడు భూములన్నీ పచ్చని పొలాలుగా మారాయి. ఎటుచూసినా పచ్చని పైర్లే. వరి సాగు కూడా విపరీతంగా పెరిగింది. దీంతో తెలంగాణ ధాన్యపు రాశిగా మారింది. తెలంగాణ రైతులు దేశానికి ధాన్యం సరఫరా చేసే స్థాయికి ఎదిగాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా బియ్యం కోసం తెలంగాణను అర్థిస్తున్నాయి. సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం.
గతంలోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బియ్యానికి కొరత ఏర్పడింది. కేంద్రాన్ని కోరినా కనికరించలేదు. కావాల్సినంత ధర ఇస్తాం ఎఫ్‌సీఐ నుంచి బియ్యం పంపిణీ చేయాలని కోరాయి. అయినా... కేంద్రం స్పందించలేదు. దీంతో తెలంగాణను అభ్యర్థించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. బియ్యం సరఫరా చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. అడగ్గానే కర్ణాటకకు మొదట బియ్యం పంపింది తెలంగాణ ప్రభుత్వమే. తమిళనాడు ప్రభుత్వానికి కూడా 2 లక్షల టన్నులు బాయిల్డ్ రైస్, లక్ష టన్నులు రా రైస్ సరఫరా చేసింది తెలంగాణ సర్కార్. 2017లోనూ తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల బియ్నాన్ని సేకరించింది. కేరళ రాష్ట్రం కూడా తమ ఆహార కొరతను నివారించేందుకు తెలంగాణ సహాయం కోరింది. తమకూ బాయిల్డ్ రైస్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో వరి సాగు చాలా తక్కువ. సన్న బియ్యం కావాలంటే.. కర్నూలు నుంచి తెచ్చుకోవాల్సిందే. కానీ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక... ఈ తొమ్మిదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ పాలనలో.. వరి సాగు విపరీతంగా పెరిగింది. రైసు మిల్లులు ధాన్యపు రాసులతో నిండిపోతున్నాయి. తెలంగాణలో వరి ధాన్యం సాగు ఎంతలా పెరిగిదంటే... అంత ధాన్యం మేము కొనలేము అంటూ కేంద్రం కూడా చేతులెత్తేసింది. అయితే... పక్క రాష్ట్రాలు మాత్రం తెలంగాణ బియ్యం మాకు పంపండి అంటే మాకు పంపండి అంటూ అభ్యర్థిస్తున్నాయి.
రాష్ట్రంలో ధాన్యం నిల్వలు అధికం కావడంతో రైస్ మిల్లులు కూడా ఫులయ్యాయి. దీంతో మిల్లుల్లోని ధాన్యం ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధాన్యం వేలం వేయబోతోంది. ఈ సమయంలో తమకు ఉప్పుడు బియ్యం కావాలని మరోసారి తమిళనాడు కోరింది. ఈసారి... 7లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేసీఆర్ సర్కార్.