తిరుపతి : రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తన వల్లే ఏర్పడిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేటి ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీటీడీలో మరింత మెరుగ్గా పాలన సాగుతోందన్నారు. ఇక్కడికి రావాలని ఎప్పుడూ అనిపిస్తుందని, కానీ స్వామి వారు అనుగ్రహం కలిగిన సమయంలో తిరుమలను సందర్శించుకుంటున్నానని చెప్పారు.


పార్టీ నేతల వల్లే కాంగ్రెస్ నాశనం..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బర్త్‌డే  గిఫ్ట్ గా తెలంగాణ రాష్ట్రాని ఏర్పాటు చేసేలా చేశామని సర్వే సత్యనారాయణ తెలిపారు. సర్వే సత్యనారాయణ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం సోనియాను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమని తాము భావించాంమని, కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. ఏపీకి వనరులు అంతగా లేవని, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారం ఆ రాష్ట్రానికి తగ్గిందని వ్యాఖ్యానించారు. 


ఏపీలో పరిపాలన మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు సర్వే సత్య నారాయణ.  అప్పటి మా కాంగ్రెస్ నేతల వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలతోనూ కూటమి ఏర్పడకుండా పోటీ చేయాలని తెలంగాణ నేతలు చెప్పడంతో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిందన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని సర్వే సత్యనారాయణ అన్నారు.

విద్యార్థుల మరణాలతో చలించిన సోనియా గాంధీ..
ఉద్యమంలో విద్యార్థులు చనిపోతున్నారు. మనం ఏం చేయాలని తాను సోనియా గాంధీని అడిగినట్లు చెప్పారు. మనం నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామా అని, యూపీఏలో మనది పెద్ద పార్టీ అని అయినా ఇతర పార్టీల సహకారం కావాలని ఆమె అన్నారు. ఓటమి, గెలుపు అనేది కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు మీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఇవ్వాలని కోరగా ఆమె అంగీకారం తెలిపినట్లు గత రోజులను సర్వే సత్యనారాయణ గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే సోనియా గాంధీ తెలంగాణపై వెనకడుకు వేస్తారని కొందరు నేతలు భావించారని చెప్పారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు తమ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: Double Decker Buses: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులపై కదలిక, మంత్రి KTR ఏం చేశారంటే - ఈ రూట్లలోనే


Also Read: Telangana CM KCR ఏ క్షణంలోనైనా తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసే ఛాన్స్, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు !