హైదరాబాదీలకు అలనాటి మధుర జ్ఞాపకాలను ఈనాటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తేవాలని రెండేళ్ల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసలే తెలంగాణ ఆర్టీసీ నిధుల కొరతతో ఉండడం, ఆపై కరోనా కేసుల సమస్యతో ఆ ప్రయత్నం వెనక్కి వెళ్లిపోయింది. కొత్త డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలుకు ఆర్థిక భారం కారణంగా ఆర్టీసీ ముందడుగు వేయలేదు. దీంతో మంత్రి కేటీఆర్ చొరవతో ఆ విషయంలో మళ్లీ కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది.
కొత్త డబుల్ డెక్కర్ బస్సుల కోసం కనీసం రూ.10 కోట్ల వరకూ అవసరం అవుతుంది. నష్టాల్లో, అప్పుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీకి అది తలకు మించిన భారం. అయితే, ఆ బస్సుల కొనుగోలు కోసం రూ.10 కోట్లను మంత్రి కేటీఆర్ సర్దుబాటు చేశారు. హెచ్‌ఎండీఏ నుంచి ఈ నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులపై మళ్లీ చిగురించాయి.
15 నుంచి 20 ఏళ్ల క్రితం వరకూ హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఎంత ఫేమస్సో ఆ తరం అందరికీ తెలుసు. కొద్ది నెలల క్రితం ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టాలని కోరగా.. అందుకు మంత్రి తన గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మళ్లీ ఆ బస్సుల్ని ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాల్సిందిగా రవాణా శాఖ మంత్రికి సూచించారు. అయితే, వాటిని మళ్లీ నగరంలో తిప్పేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి కొన్ని మార్గాలను ఎంపిక చేశారు. బస్సుల కొనుగోళ్లకు టెండర్‌లను సైతం ఆహ్వానించింది. పలు సంస్థలు ముందుకొచ్చాయి. అప్పటి నుంచి వాటిపై కసరత్తు జరుగుతూనే ఉంది.
డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్‌లో నడిపే అంశం శనివారం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై పువ్వాడ స్పందించారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బస్సులు తిరిగితే, 2022లో 9,057 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు.
2006లో కనుమరుగు
హైదరాబాద్‌లో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా జూ పార్కు వరకు, సికింద్రాబాద్ - అఫ్జల్‌గంజ్ వరకు, సికింద్రాబాద్ - మెహిదీపట్నం ఆకుపచ్చ రంగులో ఉండే రెండు అంతస్తుల డబుల్ డెక్కర్‌లు నడిచేవి. వీటిలో ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్‌లు విధులు నిర్వహించేవారు. అయితే, నగరం మార్పులు చెందడం, ఫ్లైఓవర్ల కారణంగా ఆ బస్సుల నిర్వహణ కాస్త కష్టం అయింది. దాంతో వాటిని తప్పించారు.
కొత్త రూట్లు ఇవీ..
డబుల్ డెక్కర్ బస్సుల కోసం తాజాగా 3 రూట్లను ఎంపిక చేశారు. జీడిమెట్ల – సీబీఎస్, పటాన్‌చెరు – కోఠి, అఫ్జల్‌గంజ్ – మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్‌లను నడపాలని భావిస్తున్నారు. ఈ మేరకు 10 బస్సులు కొనాలని చూస్తున్నారు.