Supreme Court dismisses petition against BC reservation order: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల కోటా కేటాయింపును సవాలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. హైకోర్టులో ఈ కేసు ఇప్పటికే విచారణలో ఉండగా, ఎందుకు సుప్రీంకు వచ్చారని జస్టిస్ విక్రమ్ నాథ్ పిటిషనర్లను ప్రశ్నించారు. పిటిషనర్‌కు హైకోర్టును సంప్రదించాలని సూచించింది.
వాంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ నంబర్ 945/2025లో తెలంగాణ ప్రభుత్వం G.O. నంబర్ 9 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కేటాయింపును ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం 32వ విభాగం కింద దాఖలైనది. పిటిషనర్ న్యాయవాది, హైకోర్టు అక్టోబర్ 8న విచారణ నిర్వహించనుందని, స్టే ఆర్డర్ లేకపోవడంతో సుప్రీంకు వచ్చామని వాదించారు. అయితే సు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ ఈ వాదనను అంగీకరించలేదు. "హైకోర్టు స్టే ఇవ్వకపోతే, అంటే మీరు ఇక్కడికి వచ్చేస్తారా?" అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
"పిటిషనర్‌కు ఆర్టికల్ 32 పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. అవసరమైన రిలీఫ్‌ల కోసం సంబంధిత హైకోర్టును సంప్రదించవచ్చు" అని ఆర్డర్ జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కేటాయింపు వివాదాస్పదంగా మారింది. గతంలో 29 శాతం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం G.O. 9 ద్వారా దీన్ని పెంచింది. ఈ మేరకు బీసీ నాయకులు స్వాగతించగా, కొందరు ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సవాలు చేశారు. హైకోర్టులో ఈ కేసు ఇప్పటికే పెండింగ్‌లో ఉంది.
ఈ నిర్ణయంతో బీసీ కోటా విషయంలో హైకోర్టు అక్టోబర్ 8న విచారణకు మార్గం సుగమం అయింది. ఎన్నికలు ఆలస్యం కాకుండా చూడాలని ప్రభుత్వం ఆశిస్తోంది. బీసీ సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి. విచారణ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా చాలా పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు.