Traffic Jam At LB Nagar Metro Station | ఎల్బీనగర్: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ ఏరియాలో ఆదివారం ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దసరాకు సొంతూళ్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. దాంతో రోడ్లపై వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. నగర వాసులు మెట్రో రైలు మార్గాన్ని ఆశ్రయించారు. అయితే, అందరూ మెట్రో రైల్లోనే ప్రయాణం చేయాలనుకుని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు చేరడంతో అక్కడ సైతం భారీగా జనాలు ఉన్నారు. దాంతో ఆఫీసుకు వెళ్లేందుకు బయలుదేరుతున్న వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా ప్రయాణికులు చేరడంతో ప్లాట్‌ఫాం వరకు చేరేందుకు గంట నుంచి రెండు గంటల పాటు క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. సాధారణంగా కేవలం వర్షం పడిన సమయంలో ఇలా మెట్రో స్టేషన్ వద్ద రద్దీ కనిపించేది. సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరిగి రావడం, అదే సమయంలో వర్షం పడే అవకాశం ఉండటంతో ఎల్బీ నగర్ మెట్రో రైల్వేస్టేషన్లో జనం రద్దీ కనిపించింది. రైల్లోకి ఎక్కడానికి కూడా రద్దీ వల్ల వీలు కావడం లేదని కొందరు ఇబ్బంది పడుతున్నారు. దాంతో నేడు ఆఫీసులకు వెళ్లే వారికి ఆలస్యం అవుతుంది.
రోడ్లపై వాహనాల రద్దీకి తోడు మెట్రో స్టేషన్‌లోనూ జనాల రద్దీ పెరగడంతో, మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్రమపద్ధతిలో క్యూ లైన్ల ద్వారా లోపలికి పంపిస్తున్నారు. దసరా సెలవులల తర్వాత ఒక్కసారిగా తిరుగు ప్రయాణం చేయడం ద్వారా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. రద్దీని తగ్గించడానికి మెట్రో అధికారులు అదనపు రైళ్లు నడిపితే బాగుండేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలు ఎల్బీనగర్ చేరుకున్నాక.. నగరంలోని ఆయా ప్రాంతాలకు దారి మళ్లుతాయి. అయితే ఒక్కసారిగా నగరానికి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.