Telangana Rains News Update | హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పలు రద్దీ ఏరియాలలో రూడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లో సోమవారం నాడు సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రాత్రిపూట వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందన్నారు.
మరో భారీ వర్షానికి సిద్ధంగా ఉండాలన్న వాతావరణశాఖరానున్న 2 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఊహించినట్లుగానే, తుఫాను తీవ్రతరం అవుతుంది. నగరవాసులు మరో భారీ వర్షానికి సిద్ధంగా ఉండండి. నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మణికొండ, ఖాజాగూడ, షేక్‌పేట్, టోలిచౌకి, అత్తాపూర్, సెర్లింగంపల్లి, పటాన్‌చెరులలో మోస్తరు వర్షాలు కురిశాయి.
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అబిడ్స్, ఖైరతాబాద్, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, బోరబండ తదితర ప్రాంతాలల్లో వర్షం పడుతోంది క్రమంగా నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని, ఈ ఉదయం మీ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్
కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం నుంచి రాత్రిపూట వాయువ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్‌లో రాబోయే 2 గంటల పాటు భారీ వర్షాలున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ పలుచోట్ల అధిక వర్షపాతం నమోదు కానుంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందగానీ, పాత బిల్డింగ్ కింద తలదాచుకోవడానికి వెళ్లవద్దని.. పిడుగులు పడతాయని, పాత భవనాలు కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
మూసీ ఉగ్రరూపం.. నిలిచిపోయిన రాకపోకలు
భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. అసలే ముసీ ఉగ్రరూపం దాల్చుతోంది. యాదాద్రి భువనగరి జిల్లాలో రుద్రవెల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహంతో భూదాన్ పోచంపల్లి - బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం భీమలింగం కత్వ వద్ద లోలెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద నీరు ప్రవహిస్తోంది. చౌటుప్పల్ - భువనగిరి మధ్య సైతం మూసీ వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి.