HCA Committee : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కమిటీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిటీ ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఇస్తామని ప్రకటించింది.  


హెచ్సీఏ ఎన్నికలపై వివాదం 


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ (HCA)ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను, తదుపరి చర్యలను ఏకసభ్య కమిటీ చూసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నివేదికతో హెచ్సీఏపై తదుపరి ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. హెచ్‌సీఏ ఎన్నికల వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హెచ్సీఏ ఎన్నికలు జరిగే బాధ్యతను ఇక జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ చూసుకోనుంది. జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్ మన్ గా నియమించిన కేసును సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. 


వివాదాలకు కేంద్ర బిందువు


2022 డిసెంబరు 11న హెచ్‌సీఏ జనరల్‌ బాడీ సమావేశం జరగగా, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. రిటైర్డ్‌ చీఫ్‌ ఎన్నికల అధికారి సంపత్‌ ను తమ ఎన్నికల అధికారిగా నిర్ణయించామన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.  హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పదవీ కాలం ముగియడం, హైదరాబాద్ లో ఇటీవల జరిగిన మ్యాచ్  టికెట్ల వ్యవహారం వివాదాస్పదం అయ్యాయి. కొన్నాళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అస్తవ్యస్తంగా మారింది.  పాలకవర్గంలో విభేదాలు, ఆర్థిక అవకతవకలు, మ్యాచ్ ల నిర్వహణలో అక్రమాలు, అవినీతి ఇలా అనేక అంశాలకు హెచ్సీఏ కేంద్ర బిందువుగా మారింది. దేశవాళీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ దిగజారుతుంది. ఒకప్పుడు అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, జయసింహ, వెంకటపతిరాజు వంటి క్రికెటర్లను అందించిన హెచ్సీఏ అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. జట్టు ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలులేకపోలేదు.  


అజారుద్దీన్ కు ఎదురుదెబ్బ


హెచ్ సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అజర్‌ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని సుప్రీం రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జి జస్టిల్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటుచేసింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుత కమిటీని రద్దు చేసి జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. జస్టిస్ నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు ఆదేశాలు జారీచేసింది.