Palla Srinivas : గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగణాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని టీడీపీ నేతలు ఆవిష్కరించారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్యే కేసులో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పొందేందుకు వివేకా హత్య జరిగినట్లు తెలుస్తుందన్నారు. అప్పట్లో ఐ ప్యాక్ టీంను లీడ్ చేసిన ప్రశాంత్ కిషోర్ ని కూడా సీబీఐ విచారించాలన్నారు. జగన్ తల్లి విజయమ్మ ప్రచారంలో పదే పదే హత్యల కోసం మాట్లాడారని గుర్తుచేశారు. ఓ పేపర్ లో నారాసుర రక్త చరిత్ర అని బేనర్ పెట్టారని, ఆ పేపర్ చీఫ్ ఎడిటర్ ను విచారించాలన్నారు. వివేకా హత్యకు రూ.45 కోట్లు సుఫారీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై సీబీఐ దర్యాప్తు చెయ్యాలన్నారు. జగన్ సానుభూతి కోసం కోడి కత్తి డ్రామా ఆడారని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని విమర్శించారు. హత్య జరిగిన సమయం ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకూ కీలక నిందితులు మాట్లాడిన కాల్స్ పై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి జగన్ ని నిలదీయాలన్నారు.
సీబీఐ అధికారులపైనే కేసులు
"వివేక హత్యకేసులో ప్రజాలకున్న అనుమానాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వివేకా కుమార్తె సునీత కోర్టుకు వెళ్లడం జగన్ సిగ్గుపడాలి. పెద్దనాన్న కొడుకు సీఎంగా ఉన్న రాష్ట్రంలో పోలీసులపై నమ్మకంలేదని ఆమె కోర్టుకు వెళ్లారు. సునీత కోర్టుకు వెళ్లడం వల్లే సీబీఐ వరకు కేసు వెళ్లింది లేకపోతే కేసును నిర్వీర్యం చేసేవారు. సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేసి దోషుల్ని శిక్షించాలి. వివేకా హత్య జరిగిన రాత్రి కాల్స్ ను విచారించాలి. గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై దర్యాప్తు చేయాలి. గెలుపే ధ్యేయంగా పెట్టుకుని వైసీపీ దారుణాలకు పాల్పడ్డారు. జగన్ బంధువు, మాజీ ఎంపీ ప్రాణానికి రక్షణలేకపోతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటిం? దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆఫీసర్స్ పై కేసులు పెట్టారు. ఇది ఎంత దారుణం. ఏ రాష్ట్రంలోనైనా ఇలా ఉంది." - పల్లా శ్రీనివాస్
ఆ రూ.40 కోట్లు ఎవరు ఇచ్చారు?
"వివేకా హత్య జరిగిన తర్వాత టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాయించారు. వారిపై కూడా విచారణ చేయాలి. ఈ విషయంపై ముందుగానే వారందరికీ అవగాహన ఉంది. కత్తి పట్టుకున్న వాడు కత్తితో పోతాడని చరిత్ర నిరూపించింది. వివేకా హత్య కేసులో నిందితులను బోనులో నిలబెట్టేవరకు టీడీపీ నిద్రపోదు. అధికారంలోకి రావడానికి సొంత మనుషుల్ని చంపుకుంటారా?, సీఎం జగన్ ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ అని డిమాండ్ చేసి, అధికారంలోకి వచ్చాక ఎందుకు సీబీఐకి ఇవ్వలేదు. డీఐజీ లెవల్ అధికారితో సిట్ వేస్తే దానిని నిర్వీర్యం చేసి ఎస్పీ లెవల్ అధికారితో సిట్ దర్యాప్తు చేయించారు. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఛార్జ్ షీట్ లో రూ.40 కోట్లు ఇస్తున్నారని చెప్పారు. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారో చెప్పాలి. " - పల్లా శ్రీనివాస్