తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం (నవంబరు 24) సుప్రీంకోర్టులో ఉదయం కొలీజియం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని వివిధ హైకోర్టుల్లోని జడ్జిలను బదిలీ చేయాలని నిర్ణయించారు. దేశంలో మొత్తం ఏడుగురు హైకోర్టు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులకు స్థానచలనం కలిగింది. ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలను వేర్వేరు ప్రాంతాలను బదిలీ చేశారు.


తెలంగాణలో హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. 


ఇంకా మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వీఎం వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు పంపారు. ఏపీ హైకోర్టులోనే ఉన్న జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న టి.రాజా రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు. 




వీరి నుంచి అభ్యంతరాలు


గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ నిఖిల్ ఎస్. కారియల్ పేరును కూడా ప్రతిపాదించినా.. గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొలీజియం ఆ లిస్టులో చేర్చలేదు. అదే సమయంలో సుప్రీం కోర్టు కొలీజియం జాబితాలో ఉన్న జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిని బదిలీ చేయడంపై తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించినా.. కొలీజియం పట్టించుకోలేదు. అంతేకాకుండా, జస్టిస్ టి. రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని మద్రాస్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యతిరేకించినా ఫలితం లేకుండా పోయింది.


అంటే కేవలం గుజరాత్ అడ్వకేట్స్ అసోసియేషన్ అభ్యంతరాల్ని మాత్రమే సుప్రీంకోర్టు కొలీజియం పరిగణలో తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ, మద్రాస్ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ అభ్యంతరాల్ని ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.