Students Suicide: ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకో వార్త దర్శనం ఇస్తుంది. చదువు ఒత్తిడితో కొందరు చనిపోతుంటే, వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బాగా చదివి తమను బాగా చూసుకుంటారని కలల కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మంగళవారం రోజే యూనివర్సిటీల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఒకరు, ఐఐటీ హైదరాబాద్ లో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. 


బాసర ట్రిపుల్ ఐటీలో ఉరివేసుకున్న బబ్లూ


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జాదవ్ బబ్లూ పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే హాస్టల్ ఉండే అతడు అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని.. అధికారులు చెబుతున్నారు. అయితే బబ్లూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తల్లిదండ్రులకు తెలియజేయగా.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అరగంట ముందే కుమారుడు ఫోన్ చేసి.. నేను బాగున్నాను డాడీ అని చెప్పాడని.. అంతలోనే ఏమైందో ఆత్మహత్య చేసుకున్నాడంటూ బబ్లూ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. 


ఐఐటీ హైదరాబాద్ లోనూ ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్య


ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మమైతా నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ లో ఉంటూ చదివే ఈమె కూడా తన గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. అయితే జులై 26వ తేదీన ఈమె క్యాంపస్ కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఒరియా, ఇంగ్లీషులో సూసైడ్ లెటర్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడింది. చదువు ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు పూర్తి బాధ్యత తనదేనని కూడా మమైతా నాయక్ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఐఐటీ హైదరాబాద్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించినట్లు సమాచారం. 2022-23 ఏడాది వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ విద్యార్థి వైజాగ్ వెళ్లి అక్కడ బీచ్‌లో సూసైడ్ చేసుకున్నాడు.  



ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఇవే..


హైదరాబాద్ ఐఐటీలో ఆత్మహత్యలు ఆగడం లేదు. దాదాపు ఏడాదిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 31న ఏపీ నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థి రాహుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ హోటల్‌పై నుంచి కిందికి దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు. జులై 17వ తేదీన క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ వైజాగ్‌లో శవమై తేలాడు. మంగళవారం ఒడిశాకు చెందిన మమైతా నాయక్ క్యాంపస్‌ హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.



చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ప్రాణాలు తీసుకోకూడదని అధికారులు చెబుతున్నారు. చదువు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. అంతగా నచ్చకపోతే.. తమకు ఇష్టమైన రంగానికి వెళ్లాలే తప్ప ఇలాంటివి చేయకూడదని వివరిస్తున్నారు.