ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 8) ఓ ప్రకటనలో తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక, రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే 
అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఆగస్టు 14 వరకూ ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని తెలిపారు.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 80 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు. 


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


వర్షాలు తగ్గడానికి కారణమిదే
‘‘ఆంధ్ర​, తెలంగాణ రాష్ట్రాలల్లో రుతుపవనాలు బలహీనపడ్డాయి. పసిఫిక్ లో వేగాన్ని పుంజుకుంటున్న ఎల్-నినో ప్రభావం మన భారత దేశంలో ఉన్న వర్షాలను తగ్గించనుంది. ఎల్-నినో అంటే పసిఫిక్ లో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా దక్షిణ అమెరికా తీరం వైపుగా ఉంటే అది ఎల్-నినో అంటారు. ఇప్పుడు మనకు అక్టోబర్ కి బలమైన ఎల్-నినో ఉంటుంది కాబట్టి వర్షాలు ఈ రెండు నెలలు (ఆగష్టు, సెప్టంబర్) లలో చాలా తక్కువగానే ఉండనున్నాయి. పూర్తిగా వర్షాలు పడవు అని కాదు. అక్కడక్కడ కొన్ని వర్షాలుంటాయే కానీ వరదలను తెప్పించే వర్షాలు ఉండవు.


మరో వైపున నేడు, రేపు దక్షిణ ఆంధ్ర జిల్లాలు ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య​, కడప జిల్లాల్లో సాయంకాలం, రాత్రి కొన్ని వర్షాలు అక్కడక్కడ నమోదవ్వనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడ పలు భాగాల్లో వర్షాలుంటాయి. ఎండల తీవ్రత రాష్ట్రం వ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉండనుంది.’’అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఈ రాష్ట్రాల్లో వర్షాలు
ఆగస్టు 9, 10 తేదీల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, ఆగస్టు 11, 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నది కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కారణంగా రాష్ట్రంలోని డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, బాగేశ్వర్, పితోర్‌గఢ్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.