Students Anointed Teachers With Milk In Khammam: తమకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లంటే విద్యార్థులకు ఎనలేని ప్రేమ. వారికి వేరే స్కూలుకు బదిలీ అయితే వెళ్లొద్దంటూ కొన్ని చోట్ల విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చూశాం. కొందరైతే తమ టీచర్ వేరే స్కూలుకు వెళ్లారని వారు కూడా ఆ పాఠాశాలకే వెళ్లి చేరారు. వీటన్నింటికీ మించి ఖమ్మం జిల్లా విద్యార్థులు వినూత్నంగా ఓ అడుగు ముందుకేశారు. తమకు పదేళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి తమతో మమేకమైన టీచర్లకు క్షీరాభిషేకం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఖమ్మం (Khammam) జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో (Mittagudem) గత పదేళ్లుగా సునీత, ఉషాకుమారి, సురేష్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ఈ ముగ్గురూ వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. తమకు ఉత్తమ బోధన అందించిన ఉపాధ్యాయులు ట్రాన్స్‌ఫర్ అయ్యారన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.


పాలాభిషేకం


తమకు ఇష్టమైన ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు పలకాలని విద్యార్థులు నిర్ణయించారు. ముందుగా వారికి పాలతో అభిషేకం చేసి.. అనంతరం బొకేలు, శాలువాలతో సన్మానించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులు తమకు క్షీరాభిషేకం చేయడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు మంచిగా చదువుకొని.. ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


Also Read: CM Revanth Reddy: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్ - 'కాటమయ్య రక్ష కిట్ల' పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి