Amith Shah Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌పై తుపాన్ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిపర్‌జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అమిత్ షా పర్యటనలో మార్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. బిపర్‌జాయ్ తుఫాన్ ప్రధానంగా గుజరాత్ పైనే ప్రభావం చూపనుంది. దీంతో అమిత్ షా మరింత ఎక్కువగా ఆ రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్ హై అలర్ట్ లో ఉంది. బిపర్జోయ్ తుఫాన్ సన్నద్ధతపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు.
బిఫర్‌జాయ్ తుఫాన్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తీరం దాటనుంది. ఖచ్చితంగా గురువారం మొత్తం అమిత్ షా హైదరాబాద్‌లో ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. బిపర్జోయ్ తుఫాను విపత్కర ప్రభావాన్ని అంచనా వేస్తూ పలు ప్రభుత్వ సంస్థలు తీరప్రాంత జిల్లాలైన సౌరాష్ట్ర, కచ్ లలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ లోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యం సరిపోదని..కేద్ర బలగాలు అవసరం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. హోంమంత్రి అణిత్ షా స్వరాష్ట్రం గుడరాత్ కావడంతో ఆ రాష్ట్రంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే పూర్తిగా టూర్ వాయిదా పడకుడా.. హైదరాబాద్ పర్యటన లేకుండా ఖమ్మం సభకు రావాలని తెలంగాణ బీజేపీ నేతలు కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
షెడ్యూల్ ప్రకారం.. అమిత్‌షా బుధవారం రాత్రి 11.55 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి శంషాబాద్ నొవాటెల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం పత్రికాధినేత వేమూరి రాధాకృష్ణతో, ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళితో మణికొండలో సమావేశమవుతారు. 12.45 గంటలకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులతో, కేడర్‌తో గంటంబావు పాటు విందు సమావేశంలో గడుపుతారు. 2.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాములవారిని దర్శించుకున్న తర్వాత.. 5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. 5.40 గంటలకు ఖమ్మంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. 6 గంటలకు పార్టీ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం.. 7.10కి గెస్ట్‌హౌ్‌సలో విశ్రాంతి తీసుకుంటారు. 7.40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కణ్నుంచీ 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ వెళతారు.
ఇప్పటి వరకూ ఖరారైన షెడ్యూల్ ఇది. అయితే తుపాను కారణంగా మార్పులు జరిగితే.. నేరుగా ఖమ్మం వచ్చి బహిరంగసభలో ప్రసంగించవచ్చని చెబుతున్నారు. ఒక వేళ టూర్ మొత్తం వాయిదా వేసినా ఆశ్చ్యం లేదంటున్నారు. తుపాను తీవ్రత పరిస్థితిని బట్టి బీజేపీ వర్గాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.