DK Shivakumar: తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేర్చారా? అని ప్రశ్నించారు.  నేటి నుంచి టీ కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర ప్రారంభమవ్వగా.. ఇందులో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అప్పుడే అమలు చేస్తున్నామని, అనుమానం ఉంటే కేసీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలని సవాల్ విసిరారు.


డిసెంబర్ 9న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం!


'కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అలాగే 1.10 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నాం. పేదలకు 10 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నాం. ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. డిసెంబర్ 10 నుంచే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలవుతాయి. తెలంగాణలో రైతు భరోసా కింద ఏకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తాం. వృద్దులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్లు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తాం. ఇంటి స్థలం లేని పేదలకు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తాం. విద్యార్థులకు యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తాం' అని శివకుమార్ అన్నారు. అయితే డీకే శివకుమార్ ఇంగ్లీష్‌లో ప్రసంగించగా.. ఆయన మాటలను మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తప్పుగా అనువాదం చేశారు. డీకే శివకుమార్ అనని మాటలు అంటూ డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని రామ్మోహన్ రెడ్డి అన్నారు.


అయితే వికారాబాద్ జిల్లా తాండూర్‌లో రెండో విడత కాంగ్రెస్ విజయభేరి యాత్రలో  డీకే శివకుమార్‌తో పాటు రేవంత్ రెడ్డి,. ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని ఏలుతానని కేసీఆర్ కలలు కంటున్నారని, హైదరాబాద్‌ను అభివృద్ది చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది కాంగ్రెస్సేనని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టుల వల్లే హైదరాబాద్ ఖ్యాతి పెరిగిందని తెలిపారు. అంచాలు ఇవ్వని స్థిరాస్తి వ్యాపారులను కేటీఆర్ అణిచివేస్తున్నారని, ఐదేళ్ల పాలనలో కేసీఆర్ రుణమాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. సాగుకు ఎక్కడా 8 నుంచి 10 గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదని, అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.


కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్‌కు తెలిసిపోయిందని, కేసీఆర్ తన ఓటమిని అచ్చంపేటలో ముందే  ఒప్పుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఓటమి ఖాయమని తెలిసి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారన్నారు. ఈ ప్రజల మీద ప్రేమతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కాగా రేపు బస్సు యాత్రలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పాల్గొననున్నారు. మెదక్‌లో పర్యటించనుండగా.. అక్కడ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. అలాగే పాదయాత్ర కూడా చేయనున్నారు.