టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పాలన చేశారని, ఆయన హయాంలో ఆ పార్టీ వర్గీయులే బాగు పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది, మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ప్రజలెవరూ సానుభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.


'పేదల సంక్షేమమే వైసీపీ లక్ష్యం'


సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులోనూ మరింత సంక్షేమం పేదలకు అందేలా చర్యలు చేపడుతున్నారని వివరించారు. వైసీపీ పెత్తందార్ల పార్టీ కాదని, పేదలు, బలహీన వర్గాల పార్టీ అని తెలిపారు. మంత్రి వర్గ కూర్పులోనూ సామాజిక న్యాయం పాటించామని గుర్తు చేశారు.


ఆధారాలతోనే బాబు అరెస్ట్


స్కిల్ స్కాం కేసులో పక్కా ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని, ఆయన పాపం పండింది కాబట్టే జైల్లో ఉన్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వ లక్షణాలు లేవని, ప్రజల కోరికలు నెరవేర్చే వ్యక్తి కాదని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని, టీడీపీ నేతలే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర ముగిసిందని, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


అభివృద్ధిని టీడీపీ తట్టుకోలేకపోతోంది


రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చంద్రబాబు ఆయన కుటుంబాన్ని మాత్రమే బాగా చూసుకున్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆయన మోసం చేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతోంది. సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేకపోతుంది.' అంటూ మండిపడ్డారు.


పురంధేశ్వరి ఆరోపణలు నిరాధారం


బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని విజయసాయి హితవు పలికారు. లిక్కర్ విషయంలో తనపై, మిథున్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెది నిలకడ లేని రాజకీయమని, స్వార్థ, సొంత అజెండాతోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని ఎద్దేవా చేశారు. 


కొనసాగుతోన్న వైసీపీ బస్సు యాత్ర


మరోవైపు, వైసీపీ నేతలు, శ్రేణులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఆ పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమాన్ని, సీఎం జగన్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. 


Also Read: 'చంద్రబాబును చంపేస్తామని బాహాటంగానే చెబుతున్నారు' - కక్షతోనే అరెస్ట్ చేశారన్న లోకేశ్, ఆధారాలు చూపాలని సవాల్