టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగత కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాజమండ్రి జైలులో శనివారం చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి 50 రోజులు పూర్తైందని, ఆయన ఏ తప్పూ చేయకపోయినా కక్షతోనే అరెస్ట్ చేయించి ప్రజల మధ్యకు రానీయకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. 'రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడడం సహజమే. కానీ చంద్రబాబు చనిపోవాలి. ఆయన్ను చంపేస్తామని బాహాటంగానే వైసీపీ నేతలు చెబుతున్నారు.' అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో నారా లోకేశ్, భువనేశ్వర్ తో పాటు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. 






ఆధారాలు చూపాలని సవాల్


కేసుతో ఎలాంటి సంబంధం లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని మంత్రి రోజా వ్యాఖ్యానించారన్న లోకేశ్, స్కిల్, ఫైబర్ నెట్ కేసులో ఆధారాలుంటే చూపాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 'నిజం గెలవాలి' పేరుతో తన తల్లి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తుంటే ఆమెను కూడా అరెస్ట్ చేస్తామంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. '50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు? కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు ఉంచగలిగారా?. స్కిల్, ఫైబర్ నెట్ కేసులో ఏ ఒక్క ఆధారమైనా చూపారా? ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో నా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్న్స్ ప్రజల ముందు ఉంచేందుకు మేం సిద్ధం.' అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.


'బస్సు యాత్ర కాదు గాలియాత్ర'


వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును ప్రజల్లోకి రానీయకుండా సైకో జగన్ బంధించారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను బయటకు రానీయకుండా లాయర్ ఫీజుకు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయకుంటే జగన్ పదేళ్లు బెయిల్ పై బయట ఎలా ఉన్నారని, సొంత బాబాయిని చంపిన అవినాష్ బయట ఎలా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. వైసీపీ నేతలు బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.


'సైకో జగన్ ను వదిలిపెట్టం'


కావలిలో వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని, హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారని, ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయని, అయినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సైకో జగన్ ను వదిలిపెట్టమని, ప్రజల తరఫున పోరాడతామని లోకేశ్ స్పష్టం చేశారు.


భయంగా ఉంది


జైలులో చంద్రబాబు భద్రతపై ఆందోళనగా ఉందని లోకేశ్ అన్నారు. వైద్య పరీక్షల పేరుతో ఏం చేస్తారోననే భయం ఉన్నట్లు చెప్పారు. జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగురుతున్నాయని, గంజాయి సరఫరా జరుగుతుందని ఆరోపించిన ఆయన, చంద్రబాబు లోపలికి వెళ్లే దృశ్యాలు ఎలా బయటకొచ్చాయని నిలదీశారు. సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.