ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడంపై పాక్ సారధి బాబర్‌ ఆజమ్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. తాము ఆరంభంలో బాగా ఆడినా ముగించడంలో మాత్రం వెనకపడ్డామని బాబర్‌ అన్నాడు. ఈ ఓటమి తమల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని పాక్‌ సారధి అన్నాడు. గెలుపు కోసం తాము చివరి వరకూ పోరాడమన్న బాబర్‌.. మరో 15 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ వేరేలా ఉండేదని అన్నాడు. అనుకున్న దానికన్నా తక్కువ పరుగులు చేసినా తమ ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు గెలుపు కోసం తుదికంటా పోరాడారని తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తు తాము విజయం సాధించలేకపోయామని మ్యాచ్‌ అనంతరం బాబర్‌ అజమ్‌ అన్నాడు. సెమీఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారడంపైనా బాబర్‌ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి సెమీ ఫైనల్ రేసులో ఉండాలని భావించామని కానీ అలా  చేయలేక పోయామని అన్నాడు. కానీ రాబోయే 3 మ్యాచ్‌లలో  అత్యుత్తమ ప్రదర్శనను  అందిస్తామన్నాడు. సెమీస్‌ చేరేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలబోమని.. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని బాబర్‌ అన్నాడు. 

 

46 ఓవర్లో అంపైర్‌ నిర్ణయంపై వివాదం కొనసాగుతున్న వేళ దానిపైనా బాబర్‌ స్పందించాడు. అంపైర్‌ ఆ అవుట్‌ ఇచ్చి ఉంటే మీరు విజయం సాధించేవారు కదా అన్న ప్రశ్నకు బాబర్‌ స్పందించాడు. అయితే అంపైర్ నిర్ణయమే తమ ఓటమికి కారణమని తాము భావించడం లేదని బాబర్ అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌ను డీఆర్‌ఎస్ గురించి అడిగితే..‘అది గేమ్‌లో భాగమని.. అతడిని ఔట్ చేసి ఉంటే నిర్ణయం మాకు అనుకూలంగా ఉండేదని.. కానీ డీఆర్‌ఎస్‌ ఆటలో ఒక భాగమని బాబర్‌ అన్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో ఓటమితో ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. అద్భుతాలు జరిగితే తప్ప ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశం లేదు. అగ్రశ్రేణి జట్లలో ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఇప్పుడు ఇంగ్లండ్ బాటలోనే పాకిస్థాన్ నడుస్తోంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం. టీమిండియా, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వరుసగా పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఇంకా బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో గెలిచినా పాకిస్థాన్ ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ 10 పాయింట్లతో సెమీస్‌కు వెళ్లాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మిగతా అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి. కానీ వాళ్లకు ఇంకా చిన్న జట్లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు కష్టమే. 

 

ఇక ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం వాకిట బోర్లా పడింది. పాక్ విజయానికి ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్‌ ఆలౌట్‌ అయింది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్‌ ఆజమ్‌ 50, సౌద్‌ షకీల్‌ 52, షాదాబ్‌ ఖాన్‌ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్‌ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది. అయిడెన్‌ మార్‌క్రమ్‌ (91: 93 బంతుల్లో 7×4,3×6)) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్‌ కాల్‌ నిర్ణయంపై టర్బోనేటర్ హర్భజన్‌ సహా నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ ఓటమికి అంపైరింగ్ తప్పిదాలు, బ్యాడ్ రూల్స్ కారణం అయ్యాయని హర్భజన్ ట్వీట్‌ చేశాడు. బంతి వికెట్‌కు తాకుతున్నట్లు తేలితే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఔట్ ఇవ్వాలని ఐసీసీకి సూచించాడు.అంపైర్‌ అవుట్‌ ఇస్తే పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించేదని ట్వీట్‌ చేస్తున్నారు.