Telangana TDP : తెలంగాణ ఎన్నికల్ల పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అయితే బీజేపీతో పొత్తుల అంశంలో ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఆదివారం ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని ఆ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారాన్ని కాసాని ఖండించారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు. తన దృష్టిలో తెలంగాణలో టీడీపీ (TDP) మాత్రమే బెస్ట్ అని అన్నారు. దీంతో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు.
ఎన్నికల బరిలో నిలవాలని రాష్ట్ర నాయకత్వం ఆశిస్తుండగా, పార్టీ అధినాయకత్వం మాత్రం పోటీపై ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతుండగా.. టీడీపీలో ఎలాంటి ఎన్నికల కసరత్తు జరగడం లేదు. గతేడాది నుంచే రాష్ట్రంలో టీడీపీ యాక్టివిటీస్ పెరగ్గా, తీరా ఎలక్షన్ టైమ్ లో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు అరెస్టు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎటూ తేల్చకపోవడంతో, ఆ పార్టీ ఇక్కడ చేతులెత్తేసినట్టేనని ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల వేళ అన్ని పార్టీల కార్యాలయాలు నేతలు, కార్యకర్తలతో కళకళలాడుతున్నాయి. కానీ, టీడీపీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్ బోసిపోయి కనిపిస్తోంది. అక్కడ కార్యకర్తల సందడి కనిపించడం లేదు. ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. కాగా, తెలంగాణ వచ్చినంక రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలిచి సత్తా చాటిన టీడీపీ..ఈ సారి నిస్సహాయంగా ఉండిపోతోంది.
నిజానికి ఈ ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని ఏడాది కిందటి నుంచే ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేసుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. అనూహ్యంగా ఆ సభ విజయవంతం కావడంతో .. తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లోనూ సభ నిర్వహించారు. దాంతో టీడీపీ నాయకత్వం క్రమంగా కింది స్థాయి లో పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఔత్సాహికులు కొంత మంది పార్టీలో చేరారు కూడా. అయితే ఖచ్చితంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ కావడం.. ఆయన బయటకు రావడం ఆలస్యం అవుతూండటంతో సమస్య జఠిలంగా మారుతోంది. ఈ క్రమంలో సరైన మార్గనిర్దేశం లేక.. టీ టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.