Special Sankranthi Treats For Stray Dogs in Mahabubabad: సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది.. భోగి మంటలు, పిల్లలకు భోగి పండ్లు, పిండి వంటలు, గాలి పటాలు, పల్లెల్లో జోరుగా కోడి పందేలు. పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని భోగి రోజున వారికి భోగి పండ్లు పోస్తారు. అలా చేస్తే చెడు దృష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారనేది అందరి నమ్మకం. అయితే, విచిత్రంగా ఓ కుటుంబం వీధి కుక్కలకు భోగి పండ్లు పోసింది. పిల్లలు మాదిరిగానే వాటికి వేడుక నిర్వహించి తమ జంతు ప్రేమను చాటుకుంది. ఈ ఒక్కసారే కాదు గత 12 ఏళ్లుగా ప్రతీ సంక్రాంతికి శునకాలకు భోగి పండ్లు పోసి వాటిపై మమకారాన్ని చాటుకుంటున్నారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన పింగళి దీపిక కుటుంబం జంతు ప్రేమికులు. వీరికి శునకాలపై ఉన్న ప్రేమ, మమకారంతో 100కు పైగా వీధి కుక్కలను చేరదీసి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వీరు భోగి రోజున పిల్లలకు ఏ విధంగా అయితే భోగి పండ్ల వేడుక నిర్వహిస్తారో అలాగే శునకాలకు సైతం భోగి పండ్లు పోశారు. సంప్రదాయ పద్ధతిలో బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు, రేగుపండ్లతో వేడుక చేశారు. ఇలా శునకాలపై బోగి పండ్లు పోయడం వల్ల వాటిలో ఉన్న క్రూరత్వం తగ్గి ప్రేమాభిమానాలు పెరుగుతాయనేది తమ కుటుంబ సభ్యుల విశ్వాసమని దీపిక తెలిపారు. తమ కుటుంబం వీధి కుక్కలను కుటుంబంలా చూసుకుంటామని చెప్పారు. శునకాలను చేరదీసి వాటిని శుభ్రంగా ఉంచడం, తిండి పెట్టడం, అవి అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి తరలిస్తామని పేర్కొన్నారు. అయితే, శునకాలకు భోగి పండ్లు పోయడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జంతువులపై మమకారం, ప్రేమ ఇలానే ఉంటుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Mahabubabad Accident: పండుగ పూట విషాదం - కుటుంబాన్ని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి