Hyderabad Dogs Attack: హైదరాబాద్‌ నగరంలో వీధికుక్కల నియంత్రణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. హైలెవల్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి కుక్కల నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన 26 అంశాల నివేదికను మేయర్ విజయలక్ష్మికి అందజేశారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పలు అంశాలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. 


కుక్కకాటు నియంత్రణపై వెటర్నరీ, శానిటేషన్, హెల్త్ విభాగాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు మేయర్‌కు సూచించారు. ప్రస్తుతం ఉన్న స్టెరిలైజేషన్ సంఖ్యను రోజువారిగా 300 నుంచి 400 వరకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, కుక్కలను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ టీంలు రాత్రివేళలో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెటర్నరీ విభాగం సేవలు వార్డువారీగా పటిష్టంగా అమలు చేసేందుకు వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్లను వార్డుకు ఇద్దరు చొప్పున ఔట్ సోర్సింగ్ పద్దతిన రెండు సంవత్సరాల పాటు నియమించాలని తెలిపారు. అంతేకాకుండా వెటర్నరీ ఆఫీసర్లు తక్కువ సంఖ్యలో పనిచేస్తున్నందున మరో 31 ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రెండు సంవత్సరాల పాటు నియమించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుక్కలను పట్టుకునేందుకు 50 క్యాచింగ్ వాహనాలు ఉన్నాయి. కాబట్టి మరో 10 వాహనాలను ఏర్పాటు చేసినట్లైతే సర్కిల్‌కు రెండు చొప్పున వాహనాల ద్వారా కుక్కల బెడద నియంత్రించవచ్చునని తెలిపారు.


ప్రజల భాగస్వామ్యం, NGO, AWO, వాలంటరీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైతే కుక్కల బెడద నియంత్రణకు చేయాల్సినవి, (do), చేయకూడనివి (Don'ts), సినిమా థియేటర్స్, ఎలక్ట్రానిక్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలని మేయర్‌ను కోరారు. కుక్కల జననాలు తగ్గించుటకు, ఇతర మున్సిపాలిటీల నుంచి వలస వచ్చే కుక్కలను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, వీధికుక్కల దత్తతను పోత్సహించాలని తెలిపారు. డాగ్ క్యాచింగ్ స్క్వాడ్ పేరును స్ట్రే డాగ్ స్టెరిలైజేషన్ యూనిట్‌గా మార్చాలని తెలిపారు. 


వీధి కుక్కల నియంత్రణకు వెటర్నరీ, హెల్త్, శానిటేషన్ సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మేయర్ విజయలక్ష్మీ. నగరంలో జోన్ వారిగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ గార్బేజీని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఒక శానిటేషన్ జవాన్ గానీ, SFAకు బాధ్యత ఇవ్వాలని జాయింట్ కమిషనర్‌ను ఆమె ఆదేశించారు. దాంతో శానిటేషన్ సక్రమంగా నిర్వహించడంతో పాటుగా కుక్కల నియంత్రణకు తోడ్పడుతుందని మేయర్ తెలిపారు. కుక్కలు ఎక్కవగా సంచరించే ప్రదేశాలను గుర్తించి వెటర్నరీ శాఖతో కలిసి   క్షేత్రస్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.


వీధి కుక్కలను పట్టుకోవడానికి 30సర్కిళ్లలో రెండు వాహనాల చొప్పున 60 వాహనాలను ఏర్పాటు  చేయాలని మేయరు అధికారులను ఆదేశించారు  మున్సిపాలిటీల్లో యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జరిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. వీధి కుక్కలను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ బదులు స్టెరిలైజేషన్ స్క్వాడ్ గా మార్చామన్నారు వెటర్నరీ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.  


కమిటీ నివేదిక ప్రకారంగా వచ్చే వారంలో హై లెవల్ కమిటీ సభ్యులతో పాటు అడిషనల్ కమీషనర్ శానిటేషన్ హెల్త్, వెటర్నరీ అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యులకు వివరించారు.