AP and Telangana Floods : రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఏపీలోని విజయవాడ , తెలంగాణలోని ఖమ్మం  జిల్లాలను వరదనీరు ముంచెత్తడంతో స్థానిక ప్రజలు తిండి, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. చాలా మంది వరదల్లో చిక్కుకున్నారు.  దీంతో ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి కనీస అవసరాలు తీర్చేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. 


 వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి పలువురు సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, అనన్య నాగళ్ల, త్రివిక్రమ్, నాగవంశీ, వెంకీ అట్లూరి విరాళాలు ఇచ్చారు. అంతే కాకుండా ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.  బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కోవిడ్ టైం నుంచి ఎంతో మందికి సేవ చేస్తూ.. రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని, దానత్వాన్ని చాటుకున్నాడు. 






మంచినీరు, ఆహారం, మెడికల్‌ కిట్‌లు, తాత్కాలిక షెడ్‌ల ఏర్పాటుకు తమ బృందం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. వర్షాలు, వరదలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు యుద్ధం చేస్తున్నాయని, ఆపదలో వారికి అండగా నిలుస్తామని సోనూసూద్ అన్నారు. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ ప్రజలు తమ సహాయ అభ్యర్థనలను పంపడానికి ఇమెయిల్ చిరునామాను అందించింది. కాబట్టి అతను తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం చేయడానికి, వనరులను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. సాయం కోసం ఎదురు చూస్తున్నవారు supportus@soodcharityfountion.org ను సంప్రదించండి అని తెలిపారు. ఈ వీడియో తన ఇన్‌స్టా ద్వారా పోస్ట్ చేయడంతో అది చూసిన వారంతా గ్రేట్ అంటున్నారు.






దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దానికి సోనూసూద్ బదులిస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము.   ప్రతిదానికీ టన్ను ధన్యవాదాలు సార్ అంటూ రిప్లై ఇచ్చారు.