Smita Sabharwal : తెలంగాణలో ఐఏఎస్ అధికారణి స్మితా సభర్వాల్ మళ్లీ విధుల్లో కనిపించారు. పంచాయతీరాజ్ మంత్రిగా సీతక్క బాధ్యత స్వీకారానికి స్వితా సభర్వాల్ హాజరయ్యారు. అంతా తానే దగ్గరుండి చూశారు. రెండు రోజుల నుంచి ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం గడుస్తున్నా ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ కావడంతో స్మిత సబర్వాల్ తీరుపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆమె డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కొత్త ఛాలెంజ్‌కు సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన పోస్ట్ మరింత సంచలనానికి దారి తీసింది. మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే స్మిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళుతున్నానంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ అత్యంత కీలకమైన అధికారిగా వ్యవహరంచారు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు. కొన్ని సార్లు ప్రత్యేక హెలికాఫ్టర్ లో కూడా వెళ్లి పనులను పర్యవేక్షించారు. బీఆర్ఎస్ అగ్రనేతలకు దగ్గర అన్న ప్రచారం ఉండటంతో కొత్త ప్రభుత్వ పెద్దలను కలవకపోవడంతో.. కేంద్ర సర్వీసుల ప్రచారం జరిగింది. స్మితా సభర్వాల్ భర్త అకున్ సభర్వాల్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్ కు చెందిన అకున్ సభర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.