Smata Sabharwal Issue : స్మితా సభర్వాల్. ఈ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చిరపరిచితమే. బీఆర్ఎస్ సర్కార్ ఉన్న సమయంలో కేసీఆర్ మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత స్మితా సభర్వాల్ సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కీలక సమీక్షలకు హాజరు కావడం లేదు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులు అంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ, స్మితా సబర్వాల్ మాత్రం ఇంతవరకు సీఎం రేవంత్ ను కలవలేదు. తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఎంట్రీ ఇస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర సర్వీస్ ముగించుకుని తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ ను కలిశారు. శుభాకాంక్షలు సైతం తెలిపారు. దీంతో ఆమెకు సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు కన్ ఫర్మ్ అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
ప్రభుత్వాలు మారడం సహజమే కానీ..అధికారులు మాత్రం రిటైరయ్యే వరకూ ఉంటారు. అందుకే గత ప్రభుత్వ పెద్దలతో ఎలా ఉన్నా.. ప్రభుత్వం మారగనే అధికారులు కూడా మారిపోతారు. డీజీపీ అంజనీకుమారే దీనికి ఉదాహరణ. అలాగే అందరూ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ స్మితా సభర్వాల్ మాత్రం కొత్త సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపకపోగా..అసలు సమీక్షలకు కూడా హాజరు కావడం లేదు. కేంద్ర సర్వీసులకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.