Janasena Criticizes AP Government : అధికారం పోవడం ఖాయమని తేలడంతో కేబినెట్ సమావేశాల్లో భూములను హోల్ సేల్‌గా క్లియరెన్స్ సేల్ మొదలు పెట్టారని ఏపీ సర్కార్‌పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు.   గత   నవంబర్‌ మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించాన్నారు.  దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్‌ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారని విమర్శలు గుప్పించారు. 


గతంలో పరిశ్రమ పెట్టలేమన్న అనిల్ అంబానీ - ఇప్పుడు వారికే భూములు కేటాయింపు                      


కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మేం కట్టలేమని అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. 2600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేస్తామని అనిల్ అంబానీ సంస్థ చెప్పేసింది. కానీ, సడెన్‌గా అదే అనిల్ అంబానీ సంస్థకు ఆ భూములని కట్టబెట్టారు. ఏం క్విడ్ ప్రో కో జరిగిందని ఈ భూములను తిరిగి అనిల్ అంబానీకి కట్టబెట్టారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.  


నియోజన్ అనే సంస్థకు భూముల కేటాయింపు                                      


నియోజన్ ప్రాపర్టీ సంస్థ అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తామంటే సుమారు 300 ఎకరాల్లో వైఎస్ హయాంలో భూములు కేటాయించారని  నాదెండ్ల మనోహర్ తెలిపారు.  ఈ భూములు తిరిగి ఇచ్చేయమని వైఎస్‌ జగన్ వెంటపడ్డారు.. వాళ్లు కోర్టుకెళ్లారు. అపెరల్ పార్క్‌గా కాకుండా ఇతర జనరల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం కేటాయించాలని అదే సంస్థ కోరింది. అపెరల్ పార్క్‌ అయితే చాలా మంది మహిళలకు ఉపాధి లభించేది. జనరల్ ఇంజనీరింగ్ అనే పేరుతో భూములు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయన్నారు.  కానీ, జగన్ అవేవీ పట్టించుకోకుండా భూములను కట్టబెట్టేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.  ఎస్ఐపీసీ ఒప్పుకోకున్నా.. తిరస్కరించినా.. సీఎం నేతృత్వంలోని ఎస్ఐపీబీ మాత్రం ఆమోదించిందన్నారు. 


క్విడ్ ప్రో కోకు పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలు                                  


అప్పటి భూమి విలువ ఎంతుంది..? ఇప్పుడు భూముల విలువ ఎంతుంది..? ఈ రెండు సంస్థలకు భూములను అప్పగిస్తూ సేల్ డీడ్ చేయడం వెనుకున్న మతలబేంటీ..? అని నిలదీశారు.. ఇదే సమయంలో మేం ప్రభుత్వంలోకి రాగానే వీటిని పరిశీలిస్తాం అని ప్రకటించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పుకుంటూ వచ్చారు. పరిశ్రమల కోసం వైఎస్ నాడు ఎస్ఈజెడ్ లు ఏర్పాటు చేశారు. పెట్టుబడులను వైఎస్సార్ ప్రొత్సహించారు. కానీ, వైఎస్ తనయుడైన జగన్ ఆ భూముల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని  ఆరోపించారు.