Hyderabad Police Commissioner : డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్  (Hyderabad )పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ( Kothakota Srinivas Reddy) వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా (Drugs Suppliers)ముఠాల కార్యకలాపాలను సహించేది లేదన్నారు. హైదరాబాద్‌ నూతన సీపీగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు...డ్రగ్స్ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్‌ ముఠాలు సరఫరాను బంద్ చేయాలని,  డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సినీ పరిశ్రమలోని వారు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిసిందని వారు మారాలని సీపీ సూచించారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్‌ మూలాలుంటే సహించేది లేదని, దీనిపై సినీ రంగానికి చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 


హైదరాబాద్ లో విధులు సవాళ్లతో కూడుకున్నవి
హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నదన్నారు శ్రీనివాస్ రెడ్డి. డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది సహకారంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానన్నారు శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 


తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన మార్క్ పాలన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా డ్రగ్స్ వ్యవహారం పైన రేవంత్ ఫోకస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ దందా తెలంగాణలో జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు ఏం అవసరమో అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు నార్కోటిక్‌ బ్యూరోకు సందీప్‌ శాండిల్యను డైరెక్టర్‌ గా నియమించారు. 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్‌ చేసిన కెల్విన్‌ ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు.


మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్‌ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు.