అందమైన జ్ఞాపకాలు, మధురానుభూతులు, గుర్తుండి పోయే సన్నివేశాలు. ఇలా ఒకటేమిటి మనిషి జీవితంలో ప్రతి సన్నివేశాన్ని కళ్ల ముందు ఉంచేది ఫొటో. ఒక్క ఫొటో వెయ్యి భావాలను వ్యక్తపరుస్తుందంటారు. అలాంటి ఫొటోలు షూట్ చేసుకునేందుకు వేదిగా మారుతోంది వరంగల్‌లోని పార్కు. 


కెమెరాలు, కెమెరామెన్లు, లైట్ బాయిలు, సెటప్‌మెన్లు, ఫొటోగ్రఫీ కోసం ఉపయోగించే ప్రాపర్టీస్, పిల్లల కోలాహలం, తల్లిదండ్రుల ఉత్సాహానికి ఆ పార్క్‌ వేదిక అవుతోంది. చిన్నారుల బుడిబుడి నడకలు, అల్లరి చేష్టలు, సుదీర్ఘ కాలం పాటు గుర్తుండేలా తీసే తీపి జ్ఞాపకాల ఫొటోషూట్లు. దీనికి మరో పేరే బేబీ షూట్. సంవత్సరంలోపు సంవత్సరం పైబడిన పిల్లల హావభావాలను కెమెరాల్లో బంధిస్తారిక్కడ.






బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో ఏ రోజు చూసిన బేబీ షూట్ షూటింగ్స్ జరుగుతుంటాయి. సినిమా సెట్టింగ్స్‌ను తలపించే సెట్‌లో చిన్నారుల నవ్వులు అమాయక చూపులు బుడిబుడి అడుగులు బంధిస్తుంటారు. పిల్లల అందమైన చూపులు ఏడుపులు ఇలా ఒకటేమిటి ప్రతి సన్నివేశాన్ని తీపి జ్ఞాపకాలుగా గుర్తుండి పోయేలా కెమెరాల్లో షూట్ చేస్తున్నారు.


పూల తొట్టెలో కూర్చున్నట్టు, ఎడ్ల బండిలో సవారి చేస్తున్నట్టు, బైక్, కార్లు నడుపుతున్నట్టు, వాటర్ ఫౌంటెన్‌లో ఆడుతున్నట్లు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు మొదటి బర్త్‌డేకు ఫొటోగ్రఫీ చేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. ఉదయం 10 గంటలకు ఈ బేబీ ఫొటోషూట్ ప్రారంభమైతే సాయంత్రం వరకు కొనసాగుతుంది. మినిమం రోజుకు ఐదు షూటు జరుగుతాయి. ఆదివారం వస్తే మాత్రం ఇక్కడ ఖాళీ ఉండదు. పిల్లలు, తల్లిదండ్రులు, అమ్మమ్మలు నానమ్మలు పిన్నులు, బాబాయిలు మొత్తం కుటుంబమంతా తరలివచ్చి మధుర సన్నివేశాలు క్లిక్‌మనిపిస్తుంటారు. ఇలాంటి జ్ఞాపకాలకు మించిన ఆనందం మరొకటి లేదని భారీగా ఖర్చుపెట్టి ఫొటోషూట్ చేయించుకుంటున్నారు.


మెమొరీగా ఉండడం కోసం ఫొటోలు తీయించుకుంటున్నామని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని ఫొటో రూపంలో భద్రపరచుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. పిల్లల సంతోషం కోసం ఖర్చు సైతం వెనుకాడడం లేదు. బేబీ షూట్ అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని అంటున్నారు.


ఫొటోగ్రఫీ రంగం కొత్త పుంతలు తొక్కడం, జనరేషన్ కు అనుగుణంగా ఫొటోగ్రఫీ మారడంతో మంచి ఆదరణ పెరిగింది. సంవత్సరంలోపు సంవత్సరం పైబడిన పిల్లల కోసం ఇండోర్ అవుట్‌డోర్ ఫొటోషూట్ ఉంటుందని ఫొటోగ్రాఫర్ రఘు చెప్పారు. 25 రకాల ప్రాపర్టీస్‌తో ఫొటోషూట్ చేస్తామని అంటున్నారు.


ఫొటోషూట్ తర్వాత పేరెంట్స్ ఆ ఫొటోలను చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తారని అభిప్రాయపడ్డారు. పిల్లల మంచి సన్నివేశం కోసం వెయిట్ చేసి ఆ ఫొటోలను బంధించి వాటి తల్లిదండ్రులకు అప్పగిస్తామని మరో ఫొటోగ్రాఫర్ ప్రేమ్ చెప్పారు. ఫొటోగ్రఫీ సృజనాత్మకమైన రంగం. ఒక్క క్లిక్‌తో ఎన్నో సన్నివేశాలు చారిత్రక ఘటనలను బంధిస్తుంది. మర్చిపోలేని జ్ఞాపకాలను ఫొటో అందిస్తుంది.కాబట్టి ప్రతి సన్నివేశాన్ని సంతోషం బాధలకు గుర్తు ఫొటో.