Madhya Pradesh New Chief Minister Oath : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో (BJP) సర్కారు కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav)ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుబాయి పటేల్...మోహన్ యాదవ్ చేత ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్‌రా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి ఆదిత్య నాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
తండ్రి పూనమ్‌చంద్ చాయ్ వాలా
మోహన్ యాదవ్ తండ్రి పూనమ్‌చంద్ యాదవ్ (Poonamchand Yadav)కు ఐదుగురు సంతానం. వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్ యాదవ్ అందరికి కంటే చిన్నవాడు. పూనమ్‌చంద్ మాలిపురలో చాయ్ దుకాణం నిర్వహించేవారు. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నప్పటికీ అందర్నీ ఉన్నత చదువులు చదివించినట్లు మోహన్ యాదవ్ కుమార్తె డా.ఆకాంక్ష తెలిపారు. సామాన్య కుటుంబ నేపథ్యమున్న తమ తండ్రిని పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మోహన్ యాదవ్.. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టారు.
మోహన్ యాదవ్ కు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు
230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అఖండ విజయం సాధించింది. కాషాయ పార్టీ 163 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్ 66 స్థానాలకు పరిమితమైంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మోహన్ యాదవ్, మార్చి 25, 1965న ఉజ్జయినిలో జన్మించారు. స్థానిక మాధవ్ సైన్స్ కాలేజీలో విద్యార్థి సంఘ కార్యదర్శిగా 1982లో ఎన్నికయ్యారు. 1984లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో సత్సంబంధాలున్నాయి. పక్కా హిందుత్వ వాది. కర్రసాము, కత్తి విన్యాసాల్లోనూ సిద్ధహస్తుడు. 1991లో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. పార్టీలో యువమోర్చాతోపాటు పలు కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బీఎస్‌సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏతోపాటు పీహెచ్‌డీ చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై మీడియా ఆలోచనాధోరణి అనే థీసిస్‌ను ఎంచుకున్న ఆయన, 2008లో దాన్ని పూర్తిచేశారు.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపు
2004 నుంచి 2010 వరకు ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా పని చేశారు. 2011 నుంచి 13 వరకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర రెజ్లింగ్, ఒలింపిక్ అసోసియేషన్‌లలోనూ మోహన్ యాదవ్ చురుకుగా వ్యవహరించారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో నెగ్గి, మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో శివరాజ్ సింగ్ చౌహన్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నుంచి పోటీ చేసి...మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయంతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.