Kirpan In Plane: విమానంలో కత్తులు, పేలుడు వస్తువులు, మారణాయుధాలు, ప్రాణాంతకమైన వస్తువులకు అనుమతి ఉండదు. అయితే ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన పైలెట్ (IndiGo Pilot) కోర్టు మెట్లు ఎక్కాడు. తాను విమానం నడపడానికి వెళ్తున్న సమయంలో తనతో పాటు తమ ఆచార వ్యవహారమైన కిర్పాన్ (చిన్నపాటి కత్తి) (Kirpan)ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని కేంద్రం, విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. వివరాలు..
ఇండిగో అనే ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్న పైలట్ అంగద్ సింగ్ పైలట్ తాను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు 'కిర్పాన్'ని తీసుకెళ్లేందుకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కిర్పాన్ అనేది సిక్కులు పవిత్రంగా చూసుకునే ఐదు విశిష్ట చిహ్నాలలో ఒకటి. వంపు తిరిగిన చిన్న కత్తి. సిక్కులు వాటిని తమ రాజసానికి ప్రతీకగా భావిస్తారు. బలహీనులను రక్షించడం, న్యాయాన్ని నిలబెట్టడం, సిక్కుల విధిని సూచించేలా ఉంటుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛలో భాగంగా కిర్పాన్ ధరించే హక్కు తనకు ఉందని హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందు దాఖలు చేసిన పిటిషన్‌లో అంగద్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు నితిన్ సాంబ్రే, అభయ్ మంత్రిలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి, విమానయాన సంస్థకు సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 29, 2024కి వాయిదా వేసింది.
మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విధించిన ఆంక్షలను సవరించాల్సిన అవసరం ఉందని అంగద్ సింగ్ తరఫు న్యాయవాది సాహిల్ శ్యామ్ దివాని కోరారు. మార్చి 12, 2022లో సిక్కు ప్రయాణికులు నిర్దిష్ట పరిమాణంలో కిర్పాన్‌ను తీసుకెళ్లడానికి అనుమతిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని వాదనలు వినిపించారు.
అయితే ఎయిర్‌పోర్టులు లేదా ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఉద్యోగులు (సిక్కు మతానికి చెందిన వారితో సహా) కిర్పాన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అంగద్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రయాణికులు విమానంలో కిర్పాన్‌ను తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నారని, కానీ ఎయిర్‌లైన్ సిబ్బందికి అదే హక్కును ఇవ్వకపోవడం తమ హక్కుల ఉల్లంఘన కిందే వస్తుందని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్‌ను ఆదేశించింది.
సిక్కులు పవిత్రంగా భావించేవి ఇవే
అమృత్ సంచార్ దీక్షా సిక్కులు "ఐదు కే"లను పవిత్రంగా నిర్వహిస్తారు. అవి కేష్, కారా, కంగా, కచేరా, కిర్పాన్
- కేష్ : కత్తిరించని జుట్టు, దేవుని చిత్తాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది.
- కారా : దేవునితో ఐక్యతను సూచించే స్టీల్ బ్రాస్లెట్
- కంగా : జుట్టును చక్కగా, శుభ్రంగా ఉంచడానికి ఒక చెక్క దువ్వెన.
- కచేర : నైతిక నిగ్రహాన్ని గుర్తుచేసే కాటన్ లోదుస్తులు.
- కిర్పాన్ : బలహీనులను రక్షించడం, న్యాయాన్ని నిలబెట్టడం సిక్కు విధిని సూచించే ఉత్సవ కత్తి