కృత్రిమ మేధతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందన్నారు ప్రధాని మోడీ. సరైన పద్ధతిలో ఏఐని వినియోగించకపోతే ప్రపంచం ఉనికే ప్రమాదంలో పడుతుందన్నారు. కృతిమ మేధతో (Artificial Intelligence) ముప్పు పొంచి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పునరుద్ఘాటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ శిఖరాగ్ర సదస్సును ప్రధాని ప్రారంభించారు. భారతదేశ సాంకేతిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే సామర్థ్యం కృత్రిమ మేధకు (AI)కి ఉందన్నారు. కృత్రిమ మేధతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న మోడీ...అదే స్థాయిలో నష్టాలు కూడా ఉండటం బాధాకరమన్నారు. అయితే, ఈ అధునాతన సాంకేతికత ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడాలని, లేదంటే అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచదేశాలను హెచ్చరించారు. అంతేకాకుండా టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించకపోతే.. ఇటీవల చర్చనీయాంశమవుతున్న డీప్‌ఫేక్‌ టెక్నాలజీ లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పారు. కృత్రిమ మేధ అభివృద్ధిని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటి ఫలితాలను ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోడీ తెలిపారు.

Continues below advertisement


21వ శతాబ్దంలో మానవజాతికి సాయం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఓ అద్భుతమైన సాంకేతికత అన్నారు ప్రధాని మోడీ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మనల్ని నాశనం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని హెచ్చరించారు. ఒకవేళ కృత్రిమమేధ ఉగ్రవాదుల చేతికి చిక్కితే...ప్రపంచం ఉనికే ప్రమాదంలో పడుతుందని  మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మానవ రహిత దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఎదురైతే...వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.