Sitaram Yechury Biography: ప్రముఖ రాజకీయ నాయకులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి పలుమార్లు విషమించింది. ఈరోజు ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.


బాల్య విద్యాబ్యాసం
1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో సాగింది. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీర్‌గా, తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి వచ్చిన ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశారు. అతను ప్రసిద్ధ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు.  జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా, డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టారు ఏచూరి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.  ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు.



వ్యక్తిగత జీవితం
మొదట ఇంద్రాణీ మజుందార్‌ను పెళ్లి చేసుకున్న ఏచూరి, ఆమెతో విడిపోయాక జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇంద్రాణీ మజుందార్‌తో ఆయనకు ఇద్దరు పిల్లలు కలిగారు.  ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి 34 ఏళ్ల వయసులో 2021 ఏప్రిల్‌లో కరోనా సమయంలో కన్నుమూశారు. ఆయన కూతురు అఖిలా ఏచూరి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. 



రాజకీయ నేపథ్యం
సీతారాం ఏచూరి 1975లో సీపీఐ(ఎం)లో చేరారు. అనతి కాలంలోనే ఏచూరి ఎస్‌ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1984లో ఏచూరి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి, ఆ తర్వాత 1992లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. సమర్ధవంతమైన భావ వ్యక్తీకరణ, పార్టీ పట్ల అంకితభావంతో ఆయన తక్కువ కాలంలోనే పార్టీలో మంచి లీడర్ గా గుర్తింపు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత, ఆయన ఒక సంవత్సరంలో (1977-78) మూడుసార్లు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారని చెబుతుండేవారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా ఉన్న ఇందిరా గాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు. 1977లో ఎమర్జెన్సీ ముగిసి, ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయినా, ఆమె జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా కొనసాగారు. దీనిని వ్యతిరేకిస్తూ,  దాదాపు 500 మంది విద్యార్థులు సీతారాం ఏచూరి నేతృత్వంలో ఇందిరా గాంధీ ఇంటి వద్దకు వెళ్లి నిరసన ప్రదర్శన చేపట్టారు. యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో ఇందిరాకు ఏచూరి ఒక మెమోరాండాన్ని చదివి వినిపించారు.


రెండు సార్లు ఎంపీగా
సీతారాం ఏచూరి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. మొదటిసారి 2005లో, రెండోసారి 2011లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రైతాంగం, శ్రామికుల కష్టాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలు, విదేశీ విధానాలు, మతతత్వ ముప్పు సమస్యలపై రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయ. ఆయన గతంలో రవాణా, పర్యాటకం, సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా కూడా పని చేశారు. 2004లోనూ యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. తుది శ్వాస విడిచే వరకు ఆయన సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన సీపీఐ (ఎం) మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 2018లో రెండోసారి, 2022లో మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.