SIT To Supreme Court :  ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారానే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్తామని అప్పటి  వరకూ జడ్జిమెంట్ ను సస్పెన్షన్ లో పెట్టాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో కోరారు. దీనికి హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా.. సీబీఐ విచారణ ప్రారంభించడానికి అవకాశం ఉంది. 


సీబీఐ విచారణ చేపడితే తమకు అన్యాయం జరుగుతుందంటున్న ఎమ్మెల్యేలు


సీబీఐ విచారణ చేపడితే.. ఆ కేసు కోణం మారిపోతుందని.. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు టార్గెట్ అవుతారని ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్ నేతలు.. వేగంగా సుప్రీంకోర్టుకు వెళ్లి కనీసం స్టే తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ట్రాప్ ఇష్యూలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు ఇదే విషయం చెప్పారు. తాము సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. సీబీఐ అధికారులు ఇంకా కేసు నమోదు చేయలేదు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 


రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లోనే అసలు ట్రాప్ 
 
హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో నలుగురు  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు  తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.  ర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్  అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడంలేదని, సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలని హైకోర్టు‌లో పలు పిటిషన్‌లు దాఖలైయ్యాయి. అన్ని పిటిషన్ లను కలిపి విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి న్యాయమూర్తి ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తీర్పు ప్రకటించారు.


సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా ?


సింగిల్ జడ్జి బెంచ్ గత ఏడాది డిసెంబర్ 26న సిట్‌ను రద్దు చేసి, కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు జనవరి 30 వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈరోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పు బట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీంకోర్టు తప్ప మరో మార్గంలేదు.