Minister KTR : కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా నిర్మించిన రైస్‌ మిల్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు.  రైతు బంధు నిధులతో రైస్‌మిల్‌ను స్థాపించాలనుకోవడం గొప్పనిర్ణయమన్నారు. రైస్‌ మిల్‌ యూనిట్‌ విజయవంతంగా నడవాలని, రాష్ట్రం మొత్తానికి ఇది ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ గ్రామాలు అభివృద్ధి చిరునామాగా మారాయన్నారు. సిరిసిల్ల జిల్లా వరుసగా మూడు సార్లు  స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లా పరిషత్‌గా నిలవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీల గురించి ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో పాఠ్యాంశాలుగా బోధిస్తుడడం గర్వకారణమని స్పష్టం చేశారు.  


తెలంగాణపై పగబట్టిన కేంద్రం 


అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్ల సిరిసిల్లా జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరుసగా మూడుసార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉత్తమ గ్రామాలుగా గంగదేవిపల్లి, అంకాపూర్‌ మాత్రమే ఉండేవని ఇప్పుడు అనేక గ్రామాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయన్నారు. గ్రామపంచాయతీల్లో రూ.కోటి లోపు ఉన్న బకాయిలన్నీ వెంటనే విడుదల చేస్తున్నామన్నారు. పంచాయతీలకు ఉన్న మొత్తం రూ.1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం తొక్కిపెడుతుందని విమర్శించారు.


సిరిసిల్ల మరో కోనసీమ 


తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా నిర్వహించామని గుర్తుచేశారు. విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు ప్రశ్నిస్తున్నారని,  ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణలో జరిగిన త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమన్నారు. పాత ఖైదీగా వ్యవహరించడం మాని భవిష్యత్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ...కాలర్ ఎగరేసి కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరిగిందని చెప్పవచ్చన్నారు. తెలంగాణ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని కేంద్రం లిస్ట్ తీస్తే .... 19 తెలంగాణలో ఉన్నాయన్నారు. దేశంలో బెస్ట్ మున్సిపాలిటీల్లో 27 అవార్డులు తెలంగాణకు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. బలగం సినిమా చూశానన్న కేటీఆర్.. ఆ సినిమాలో సిరిసిల్ల జిల్లాను చూపించారన్నారు. ఇవాళ సిరిసిల్ల కోనసీమను తలదన్నేలా పచ్చదనంగా మారిందన్నారు.