India's Richest Woman: భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ అని ఠక్కున చెబుతారు. మరి, భారతదేశంలోని మహిళల్లో ఎక్కువ ధనవంతురాలు ఎవరంటే సమాధానం చెప్పలగరా?.


ప్రపంచ ధనవంతుల జాబితాలో పురుషులతో పాటు మహిళలూ ఉన్నారు. అంతేకాదు, సంపద విషయంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువేమీ కాదు. అమెరికా, జర్మనీ, ఇటలీ, భారత్‌తో సహా చాలా దేశాలకు చెందిన మహిళలు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చేరారు. 


ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్‌లో ‍‌(forbes billionaires list 2023) ... అమెరికా నుంచి 92 మంది మహిళలు, చైనా నుంచి 46, జర్మనీ నుంచి 36, ఇటలీ నుంచి 16 ఉన్నారు. మన భారతదేశం నుంచి 9 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. 


ముకేష్ అంబానీ కంటే ఎక్కువ సంపద                            
ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్‌ ప్రకారం, ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ‍‌(Françoise Bettencourt Meyers). ఫ్రాన్స్‌కు చెందిన లోరియల్ (L'Oréal) కంపెనీ యజమాని ఆమె. ఈ ప్రపంచ ధనిక మహిళ దగ్గర ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ సంపద ఉంది. ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ ఆస్తుల విలువ 85.9 బిలియన్‌ డాలర్లు, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు, ఆయన మొత్తం సంపద విలువ (Mukesh Ambani networth) 78.8 బిలియన్ డాలర్లు. భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ (India's Richest Man Mukesh Ambani).


అయితే భారతదేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరు, ఆమె ఏ వ్యాపారం చేస్తారో మీకు తెలుసా?. భారతదేశంలో ఒక వ్యాపార సామ్రాజాన్ని రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నడిపిస్తున్న భారతదేశపు అత్యంత సంపన్న మహిళ గురించి మనం చెప్పుకుందాం. 


భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ ఎవరు?                         
ముఖేష్ అంబానీ తర్వాత భారతదేశంలో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ (Gautam Adani). మనం మహిళల గురించి మాట్లాడినట్లయితే, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal). సావిత్రి జిందాల్ OP జిందాల్ (Om Prakash Jindal) భార్య. 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ మరణించిన తర్వాత, ఆయన భార్య సావిత్రి జిందాల్‌ వ్యాపారాన్ని చేపట్టారు. అయితే, ఈ గ్రూప్‌ వ్యాపారం అతని నలుగురు కొడుకులకు పంచి పెట్టారు. సావిత్రి జిందాల్ తన పెద్ద కొడుకు వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆమె చిన్న కొడుకే మనందరికీ తెలిసిన పేరు నవీన్ జిందాల్.


నికర విలువ ఎంత
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్ (Savitri Jindal networth), ఆమె కుటుంబం నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు (రూ. 13,504 కోట్లు). ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆమె 101వ స్థానంలో ఉన్నారు. స్టీల్, విద్యుత్, మౌలిక సదుపాయాలు, సిమెంట్ వ్యాపారాలను ఈ కంపెనీ నిర్వహిస్తుంది.