తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు వివిధ ప్రాజెక్టులు క్రమంగా నిండుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పడుతున్న వర్షం వల్ల సింగూరు ప్రాజెక్టు నిండుతూ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 3,288 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంది. అయితే, మరో 3,288 క్యూసెక్కులను బయటికి వదులుతున్నట్లుగా ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. అయితే, ఎగువ ప్రాంతాల నుంచి మంజీరా నదిలో అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం (సెప్టెంబరు 11) సాయంత్రానికి ప్రాజెక్టులో 29.29 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. 


ఇక, ప్రతి 3 గంటలకు ఒకసారి నీటి ప్రవాహం హెచ్చు తగ్గులను గమినిస్తూ అధికారులు ప్రాజెక్టు దగ్గరే ఉంటున్నారు. ఏ క్షణమైనా ఎగువ ప్రాంతం నుంచి వరద తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధిక వరద వస్తుందని అంచనాలు ఉండడంతో అధికారులు, ప్రాజెక్టు సిబ్బంది 24 గంటలు ప్రాజెక్టు వద్దే ఉంటూ సందర్శకులను ఎవరిని కూడా ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు.


కోయిల్ సాగర్ కూడా


ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌ కూడా నిండుకుండలా మారి జళకళ సంతరించుకుంది. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల రిజర్వాయర్ లోకి బాగా వరద నీరు వచ్చి చేరుతుంది. తీలేరు పం ప్‌హౌస్‌ నుంచి కృష్ణా జలాలను కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులోకి తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆదివారం (సెప్టెంబరు 10) నాటికి 31.2 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.


ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.5 అడుగులకు గానూ మరో 1.4 ఫీట్ల మేర నీరు వస్తే ప్రాజెక్టు గేట్లను తెరుస్తామని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టును చూడడానికి వేర్వేరు ప్రాంతాల నుంచి పర్యటకులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.