Ladakh Lt Governor: లడఖ్ భూభాగంలోని అధిక ప్రాంతాన్ని పొరుగు దేశం చైనా ఆక్రమించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంపై తాజాగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు. లడఖ్ లోని ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురి కాలేదని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ. మిశ్రా అన్నారు. లడఖ్ లో ఎక్కువ భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రశ్నించగా లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా స్పందించారు. తాను ఎలాంటి ప్రకటనలపైనా వ్యాఖ్యానించబోనని, అయితే లడఖ్ భూభాగంలోని అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని తేల్చి చెప్పారు.
'నేను ఎవరి ప్రకటనపై వ్యాఖ్యానించను. కానీ నేను స్వయంగా చూశాను కాబట్టి వాస్తవమేంటో చెబుతాను. చైనా ఒక్క చదరపు అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బలంగా, సిద్ధంగా ఉన్నాయి' అని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా పేర్కొన్నారు.
ఇటీవల మ్యాప్ విడుదల చేసిన చైనా
కాగా చైనా ఇటీవలె మ్యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాప్ లో అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంలో కలుపుకుంటూ చైనా మ్యాప్‌ను విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. చైనా ఆగడాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. 1962 యుద్ధంలో ఆక్రమించిన అక్సాయ్ చిన్, దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంలో భాగంగా చూపుతూ చైనా ప్రామాణిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని చైనాలో భాగంగా చూపించింది.
దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘లడఖ్‌లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని మోదీ చెప్పింది అబద్ధమని నేను చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను. చైనా అతిక్రమించిందని లడఖ్ మొత్తానికి తెలుసు. ఈ మ్యాప్ అంశం చాలా తీవ్రమైనది. వారు భూమిని లాక్కున్నారు. దీనిపై ప్రధాని స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.
దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పందిస్తూ. మ్యాప్ అంటే ఏమీ లేదన్నారు. చైనాకు అలాంటి మ్యాప్‌లను విడుదల చేసే అలవాటు ఉందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘చైనా చాలా సార్లు తమది కాని భూభాగాలతో మ్యాప్‌లు వేసింది. అది ఆ దేశానికి ఉన్న పాత అలవాటు. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో మ్యాప్‌లను ఉంచడం ద్వారా, వాస్తవంగా ఉన్న దాంట్లో ఏమీ మారదు. మా ప్రభుత్వం దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మా భూభాగంపై అసంబద్ధమైన వాదనలు చేయడం ద్వారా ఇతరుల భూభాగాలు వారికి చెందవు" అని చెప్పారు.
భారతదేశం ప్రామాణిక మ్యాప్‌పై దౌత్య మార్గాల ద్వారా నిరసనలను ప్రారంభించింది. తాము చైనా క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నామని, వాటికి ఎటువంటి ఆధారం లేదని, చైనా వైపు ఇటువంటి చర్యలు సరిహద్దు ప్రశ్న పరిష్కారాన్ని క్లిష్టతరం చేస్తాయని అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.