ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్‌ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చినప్పుడు సీఐడీ అధికారులు కేసుకు సంబంధించిన రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. 


చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
2015 జనవరి 30న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించడానికి సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చంద్రబాబు నియమించారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ సంస్థ ఉన్నతాధికారి జీవీఎస్ భాస్కర్ భార్య అపర్ణను స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను 3 నెలల ముందే ప్రజంటేషన్ లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు ఇచ్చారు.            


నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్ నుంచి 90 శాతం నిధులు రాకుండా నేరుగా ప్రభుత్వ వాటా 10 శాతం విడుదల చేసేశారు. ఆ నిధులు మొత్తం రూ.371 కోట్లు విడుదల చేయాల్సిందిగా అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్, అప్పటి ప్రభుత్వ కార్యదర్శిని అప్పట్లో సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలా జీవో నెంబర్ - 2452లోని పారాగ్రాఫ్ నెంబర్ - 153లో పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చాలా స్పష్టంగా నిధుల విడుదలకు సంబంధించి అభ్యంతరాలు తెలిపారు.


దీంట్లో అప్పటి చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు పారాగ్రాఫ్ నెంబర్-27లో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయాల్సినందిగా చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్లు అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టంగా నోట్ ఫైల్ చేశారు. 


ఈ ప్రాజెక్టులో నిధుల విడుదలపై మరోసారి పరిశీలించాల్సిందిగా జీవో నెంబర్-2452లో పారాగ్రాఫ్ నెంబర్-160లో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి సునీత చాలా స్పష్టంగా అప్పటి ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికీ నివేదించింది. దీనిపై మరోసారి ఆలోచించిన ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పారాగ్రాఫ్ నెంబర్-161, 162లో చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా తనతో మాట్లాడినట్లు నోట్ ఫైల్ రాశారు. సుబ్బారావు తనతో కలిసి నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు జీవోలోని 46వ పేజీ, పారాగ్రాఫ్-31లో ఉన్నట్లు అప్పటి సీఎస్ చెప్పడం వల్ల దానిని అమలు చేసినట్లు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ స్పష్టంగా రాశారు. 


సాక్ష్యధారాలు మాయం
ఈ వ్యవహారం బయటకు రావడంతో సాక్ష్యాలను మాయం చేశారు. ఏకంగా 2016 జూన్ 30న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్‌ను సుబ్బారావు ఓఎస్డీ ఎన్వీకే ప్రసాద్ (ఐదో నిందితుడు) ద్వారా మాయం చేశారు. ఈ కేసులో నిధులు కొల్లగొట్టడానికి 2014 సెప్టెంబరు 20న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చార్టెడ్ అకౌంటెంట్‌గా లక్ష్మినారాయణ (నాలుగో నిందితుడు) బంధువు వెంకటేశ్వర్లును జీవో 48 ద్వారా నియమించారు.