Singareni to provide Accidental Insurance coverage to contract workers - హైదరాబాద్: సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎట్టకేలకు సంస్థ శుభవార్త చెప్పింది. సింగరేణిలో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు వీలుగా 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా వర్తింపజేస్తామని ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీ కాంట్రాక్ట్ ఉద్యోగికి ప్రమాద బీమా అమలు చేస్తామని సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.
ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి ప్రమాద బీమా సౌకర్యం
సింగరేణి భవన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సాయంత్రం బలరామ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ బలరామ్ మాట్లాడుతూ.. ప్రమాద బీమా సదుపాయం వర్తించాలంటే ప్రతీ కాంట్రాక్ట్ ఉద్యోగి HDFC బ్యాంక్ లో శాలరీ అకౌంట్ (Salary Accont) కలిగి ఉండాలన్నారు. ఏరియా జీఎంలు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా సింగరేణి కాంట్రాక్ట్ సిబ్బందికి అవగాహన కలిగించాలని ఆదేశించారు.
రూ.1 కోటి ప్రమాద బీమా పథకం
సింగరేణి ఉద్యోగుల కోసం ఇదివరకే ఎస్‌బీఐ (SBI), యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నారు. 30 లక్షల ప్రమాద బీమా వర్తించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా వర్తింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రతలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
‘సింగరేణి ఆసుపత్రులలో కాంట్రాక్టు కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నాం. వారి కుటుంబానికి, పిల్లలకు సైతం ఆరోగ్య సేవలు అందించడంపై ఈఎస్ఐ (ESI Hospitals) ఆసుపత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాం. మొదటగా కొత్తగూడెం, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (NTPC)లలో ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా సింగరేణి ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కార్మిక చట్టాలు, కోర్టు ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు తప్పనిసరిగా పీఎఫ్ (PF), సీఎంపీఎఫ్, పింఛన్ కోసం జీతంలో కొంత రికవరీ చేస్తాం. కాంట్రాక్టర్ల ద్వారా అంతే నగదును కలిపి వారి ఖాతాల్లో జమ చేయనున్నాం.
వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు
కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, పీఎఫ్ (PF), సీఎంపీఎఫ్ చెల్లింపులు సకాలంలో జరిగేందుకు వారికి సంబంధించిన మస్టర్లను కూడా వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను చేపడతాం. ఆగస్టు మొదటి వారం నుంచి అమలు లోకి తీసుకొస్తాం. సిబ్బంది వారి మస్టర్ల నమోదు ఆధారంగా జీతాలు సహా, పీఎఫ్, సీఎంపీఎఫ్ చెల్లింపులు వారి ఖాతాల్లోకి జమ చేసే వీలుంటుంది’ అని ఎన్ బలరామ్ వివరించారు.
Also Read: BRS News: ‘రేవంతూ జనం జాడిస్తరు మిమ్మల్ని’ - బడ్జెట్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్