Madanapally Sub-Collectorate Fire News :   మదనపల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అనుమానస్పద అగ్ని ప్రమాదం ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ మిల్ మాధవరెడ్డిగా ప్రచారం పొందిన ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులు. సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాదం విషయంలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మాధవరెడ్డి గురించి సమాచారం రావడంతో ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  అగ్నిప్రమాదం జరిగిన తర్వాత  ఘటన గురించి సీఐ, డీఎస్పీ ప్రసాద్ రెడ్డికి , ఎస్పీకి సమాచారం ఇవ్వక పోవటంపైనా అనుమానం వ్యక్తం చేస్తూ సీఐడీ బృందం ప్రశ్నిస్తోంది. 


పోలీసుల అదుపులో  పలువురు అధికారులు                            
 
గతంలో మదనపల్లిలో పని చేసిన ఆర్డీవో ఎంఎస్ మురళి, ప్రస్తుతం బదిలీపై వెళ్లిన హరి ప్రసాద్, ఉద్యోగి గౌతమ్ తేజను సీఐడీ  అదుపులోకి తీసుకుంది. వీరిని  మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.  మరికొంత మంది అనుమానిత అధికారులనూ మంగళవారం అదుపులోకి తీసుకుని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు.  కుట్రగానే అధికారులు భావించి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కుట్ర వెనక అధికారులు, నాయకులు హస్తం ఉందో లేదో తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. 


పోలీసుల అదుపులో మాధవరెడ్డి                             


నాగపూర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేప్టీ ఇంజరీంగ్ సంస్థ నుంచి నిపుణులను ప్రభుత్వం  పిలిపిస్తోంది.   పైళ్ల దగ్ధంలో కుట్రను తేల్చేందుకు చిన్న అవకాశాన్నీ వదలడం లేదు.  మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో 25 విభాగాల్లోని ఫైళ్లు కాలిపోయాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం వెనుక కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో  తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. 


పెద్దిరెడ్డి  అక్రమాలు బయటపడకుండానే చేశారని ఆరోపణలు


వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెత్తనం మొత్తం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ఒక్క నగరిలో మినహా మిగతా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన చెప్పినట్లుగా వినేవారే.  ఆ సమయంలో మదనపల్లె సబ్ డివిజన్‌లో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల రికార్డులు మార్చడంతో పాటు కొన్ని ఆస్తులను నిషేధిత జాబితాను తొలగించడం.. కొన్ని ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వంటివి చేశారని ఆరోపణలు ఉన్నాయి . మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయని కలెక్టర్ చెబుతున్నారు. అసలు ఆ కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.