NEET Paper Leak Case Row: నీట్ పేపర్ లీక్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ తీర్పు కాపీని చదివి వినిపించారు. రీఎగ్జామ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. విద్యార్థుల ఆందోళన తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ధర్మాసనం వెల్లడించింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాగతమైన లోపాలున్నాయని స్పష్టం చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించడమే పిటిషనర్ల అభిప్రాయమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ పేపర్ లీక్ వల్ల 150 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్టు స్పష్టం చేసింది. పట్నా, హజారిబాఘ్‌కి చెందిన విద్యార్థులు ఈ లీక్ ద్వారా లబ్ధి పొందారని తెలిపింది. ఈ విషయంలో ఇంకా CBI విచారణ పూర్తవలేదని స్పష్టం చేసింది. పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వ్యవస్థాపరంగా నిబంధనలు ఉల్లంఘించారని వెల్లడించింది. క్వశ్చన్ పేపర్‌ని పక్కా ప్లాన్‌తో లీక్ చేశారనడానికి ఆధారాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపింది.







పేపర్ లీక్‌ జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని కోర్టు తేల్చి చెప్పింది. రీఎగ్జామ్ పెట్టడం వల్ల 24 లక్షల మంది విద్యార్థులపై ఆ ప్రభావం పడుతుందని వెల్లడించింది. ముగ్గురు జడ్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషనర్‌లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోర్టులో సబ్మిట్ చేసిన డేటాని పరిశీలించారు. భారీ స్థాయిలో పేపర్ లీక్‌ జరగలేదని NTA ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. రీటెస్ట్ పెట్టే ముందు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా రీటెస్ట్ పెట్టడం వల్ల అడ్మిషన్ షెడ్యూల్ కూడా గందరగోళంగా మారిపోతుందని అభిప్రాయపడింది. ఇది పూర్తిగా విద్యావ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేసింది. 
 






Also Read: Kerala Boy Recovered: విదేశాల నుంచి ఖరీదైన మందులు, బ్రెయిన్ ఇన్ఫెక్ష‌న్ నుంచి కోలుకుంటున్న బాలుడు