BRS on Revanth Reddy: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి గతంలో మోదీని పొగిడారని ఇప్పుడు కనీసం ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేసింది.


‘‘రేవంతూ... తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్ నిబద్ధత ఏమిటో దేశం మొత్తం చూసింది. రెండు జాతీయ పార్టీలకు 16 సీట్లు కట్టబెడితే రాష్ట్రానికి అణా పైసా తేలేకపోయిన దద్దమ్మలు మీరు. బడే భాయ్ అంటివి. గుజరాత్ మోడల్ ఆదర్శం అంటివి. అదానిని అలుముకొంటివి. అయినా పైసా విదల్చడాయే మోడీ. తగుదునమ్మా అని ఇప్పుడు కేసీఆర్ కు సవాల్ విసిరితే జనం జాడిస్తరు మిమ్మల్ని’’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.






పీఎంవో ముందు ధర్నా చేయండి - హరీశ్


రాష్ట్రానికి నిధులు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలపాలని.. ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో పాల్పడ్డ కుంభకోణాలపై అసెంబ్లీలో నిలదీస్తామని.. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అదే రోజున మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరుతుందని చెప్పారు.. 26న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్‌ను సందర్శిస్తామని చెప్పారు. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృథాగా పోతున్నా నీళ్లు ఎత్తిపోయడం లేదని.. మిడ్ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్లలో నీళ్లు నింపి రైతుల పొలాలకు తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని హరీశ్ రావు తెలిపారు.