MP Kotha Prabhakar Reddy: సంచలనం కోసమే మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై నిందితుడు రాజు దాడి చేశారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. బుధవారం కేసు వివరాలను సీపీ శ్వేత మీడియాకు వెల్లడించారు. నిందితుడు రాజుకు ఎవరి సహకారం లేదని, ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. వారం రోజుల కిందట నిందితుడు రాజు కత్తి కొనుగోలు చేసి ఎంపీ హత్యకు ప్లాన్ చేశాడని వెల్లడించారు. పథకం ప్రకారమే ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని సీపీ చెప్పారు.
విలేకరి పేరుతో దందా
నిందితుడు రాజు పలు వెబ్‌ఛాన్సల్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. విలేకరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడని తెలిపారు. వీటికి సంబంధించి రాజుపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. ఎంపీపై దాడి సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారని, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. బుధవారం నిందితుడు రాజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడని, తొగుట సీఐ కమలాకర్ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు వెల్లడించారు.
14 రోజుల రిమాండ్
ఏదైనా సంచలన ఘటన చేసి అందరి దృష్టిలో పడాలనే కత్తితో దాడి చేసినట్టు నిందితుడు అంగీకరించినట్లు సీపీ శ్వేత వివరించారు. గన్‌మెన్ ప్రభాకర్ నుంచి కత్తి, పాస్టర్ అంజయ్య వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణలో భాగంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. నిందితుడు రాజును బుధవారం కోర్టు ముందు హాజరు పరిచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దని సీపీ సూచించారు.
కార్యకర్త ముసుగులో ఎంపీపై దాడి
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై అక్టోబర్ 30న హత్యాయత్నం జరిగింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రభాకర్ రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. కార్యకర్త ముసుగులో ఓ వ్యక్తి ప్రభాకర్ రెడ్డికి అతి సమీపంలోకి వచ్చి కరచాలనం చేస్తున్నట్లుగా నటించాడు. వెంటనే జేబులో నుంచి కత్తి తీసి ఎంపీ కడుపులో పొడిచాడు. ఈ దాడిలో కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
చితకబాదిన కార్యకర్తలు
దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని చితకబాదారు. ఘటన జరిగిన వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డిని.. గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాలకు చెందిన గటాని రాజుగా గుర్తించారు. వెబ్ చానెళ్లలో పని చేస్తూ కలప రవాణా చేసే వాహనాలను ఆపడం.. డబ్బులు వసూలు చేయడం, కల్లు డిపోలు, షాపుల యజమానుల బెదిరించడం వంటి ఆరోపణలు నిందితుడిపై ఉన్నాయి.
ఇంటి స్థలం కోసం ఎంపీని కలిసిన నిందితుడు
ఇంటి స్థలం, దళితబంధు కోసం గటాని రాజు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పి పంపినట్లు సమాచారం. దీంతో రాజు కక్ష కట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాదు దళితబంధు కూడా ఇవ్వలేదన్న కోపం కూడా రాజుకు ఉందట. కావాలనే తనకు పథకాలు అందకుండా చేస్తున్నారన్న కోపంలో రాజు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.