Sharmila Arrest :   ప్రగతి  భవన్ ముట్టడికి ప్రయత్నించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను మరోసారి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారులో కూర్చుని కిందకు దిగేందుకు నిరాకరించడంతో కారుతో సహా క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయారు.  వరంగల్‌ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో.. ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. పాదయాత్రలో పాల్గొన్న ఓ వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. షర్మిల ఈ రోజు ఆ వాహనాలు తీసుకుని ప్రగతి భవన్‌కు బయలుదేరారు. ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్‌వైపు వచ్చారు. 


కారులో కూర్చుని ధర్నా చేయడంతో కారుతో సహా షర్మిలను లిఫ్ట్ చేసిన పోలీసులు 


అయితే సమాచారం అందడంతో.. పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి పోలీసులు షర్మిల వాహనాలను నిలిపివేశారు. పంజాగుట్ట -  సోమాజిగూడ మార్గంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. షర్మిలను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే కారు అద్దాలను క్లోజ్ చేసి షర్మిల అందులోనే కూర్చోవడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఈ కారణంగా ఆ దారిలో  భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వెంటనే రోడ్డుపైన ఆగిపోయిన వాహనాలను తరలించే క్రేన్‌ను తీసుకు వచ్చి..కారును లిఫ్ట్ చేశారు. అప్పటికీ షర్మిల కిందకు దిగలేదు. కారులో షర్మిల ఉండగానే పోలీసులు కారును తరలించారు. 


టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమైన వాటిని కేసీఆర్‌కు చూపించడానికి తీసుకెళ్తున్నామన్న షర్మిల 


వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ గూండాలు తమపై దాడి చేశారని.. ఆ దాడుల్లో ధ్వంసమైన వాటిని సీఎం కేసీఆర్‌కు చూపించడానికి తీసుకెళ్తున్నానని షర్మిల చెప్పారు. తనను అడ్డుకున్న పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు.   ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే లోటస్ పాండ్‌లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు పిలుపునివ్వడంతో షర్మిల బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పదకొండు గంటల సమయంలో అనూహ్యంగా పోలీసుల కళ్లు కప్పి లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన షర్మిల... స్వయంగా కారు నడుపుకుంటూ పంజాగుట్ట వైపు వచ్చారు. ఆమెతో.. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారవాన్‌ను ఆమె ప్రగతి భవన్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. 


సోమవారం ఉద్రిక్త పరిస్థితులతో షర్మిలను  అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించిన పోలీసులు 


సోమవారం వైఎస్సార్టీపీ చీఫ్​ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్​ కార్యకర్తలు దాడికి దిగారు. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కాన్వాయ్‍లోని వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నిప్పుపెట్టారు. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్​ వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆదివారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది.