Kavita Vs Sharmila : రాజకీయ విమర్శలంటే.. తిట్టుకోవడం అనే నమ్మకం ఇప్పుడు బలపడిపోయింది. కానీ అప్పుడప్పుడూ నేతలు తమ వద్ద ఉన్న పాండిత్యాన్ని బయటకు తెచ్చి రాజకీయాల్లోకి చొప్పిస్తే.. ప్రత్యేకంగా కనిపిస్తుంది. వారి మధ్య ఆ సంవాదం... ఆసక్తి రేపుతుంది. అలాంటిదే తెలంగాణలో చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య జరిగిన ఈ కవితల సంవాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మంగళవారం షర్మిల అరెస్ట్ ఎపిసోడ్ సంచలనం సృష్టించింది. ఈ అంశంపై కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో స్పందించారు. షర్మిల, బీజేపీని కలిపి పరోక్షగా విమర్శిస్తూ.. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ ట్వీట్ పెట్టారు. ఇందులో నేరుగా విమర్శించలేదు. కానీ ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది.. రెండు రోజులుగా జరుగుతున్న డ్రామా అంతా.. బీజేపీ, షర్మిల కలిసి చేస్తున్నారని కవిత చెప్పారు.
కవిత విమర్శలపై షర్మిల వెంటనే స్పందించారు. " పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు.." అంటూ కౌంటర్ ఇచ్చారు.
[అయితే సాహిత్యంలో తండ్రికి తగ్గ తనయగా కాకపోయినా మంచి అభిరుచి ఉన్న నేతగా పేరు తెచ్చుకుని జాగృతిని నడుపుతున్న కవిత ఊరుకుంటారా.. వెంటనే.. కాస్త పొడవైన కవితతోనే కౌంటర్ ఇచ్చారు. అమ్మా.. కమల బాణం అటూ ప్రారంభించి.. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. మీరు కమలం కోవర్టు ..ఆరేంజ్ ప్యారేట్టు అని పేరడీలతో.. తాను ఉద్యమంలో నుంచే పుట్టానని తేల్చారు.
కవితకు ఈ వార్త రాసే సమయానికి ఇంకా షర్మిల వైపు నుంచి ఎలాంటి కవితాత్మక రిప్లయ్ రాలేదు. ఎలాంటి రిప్లయ్ ఇస్తారా అని రాజకీయాల్లో ఉండే సాహిత్యాభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ట్వీట్ కవితల వార్ ను రెండు పార్టీల కార్యకర్తలు వైరల్ చేసుకుటున్నారు. ఎవరికి నచ్చిన కామెంట్లు వారు చేసుకుంటున్నారు.