Malkajigiri Lok Sabha  ticket Race In BJP :  భారతీయ జనతా పార్టీలో మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్ కోసం భారీ రేస్ జరుగుతోంది.  ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు.  దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో కొంతమంది ప్రజల్లోకి వెళ్తుండగా.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మరికొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ ఎవరికీ ఇంకా సంకేతాలు ఇవ్వలేదు. 


మల్కాజిగిరి సీటుపై ఆశలు పెట్టుకున్న ఈటల రాజేందర్ 


మల్కాజిగిరి నియోజకవర్గం మినీ ఇండియా లాంటిది. ఇందులో 35 లక్షల పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా సెటిల్ కావడంతో మినీ ఇండియాగా పిలుస్తారు. అసెంబ్లీకి పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోవడంతో పార్లమెంట్ కు పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరిపై గురి పెట్టారు. గతంలో పార్టీ మార్పు వార్తలు వచ్చినప్పుడు ఆయన ఖండించారు. అదే సమయంలో ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రకటించారు. హైకమాండ్ తనకు చాన్స్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ విషయానికి వస్తే హుజూరాబాద్, గజ్వేల్‌లో ఓడిపోయిన అనంతరం ఎంపీ బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటల దృష్టి మల్కాజ్‌గిరిపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న పరిచయాలతో పాటు మోదీ చరిష్మా ఈ నియోజకవర్గంలో తనను గెలిపిస్తాయని ఈటల భావిస్తున్నారు. 


గట్టి ప్రయత్నాలు చేస్తున్న మురళీధర్ రావు      


బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు కూడా టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.  రెండు సంవత్సరాలుగా ఆయన నియోజకవర పరిధిలో పర్యటిస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మరళీధర్ రావుకు ఆరెస్సెస్ వర్గాల సపోర్టు ఉంది. దీంతో ఆయన తనకే టిక్కెట్ లభిస్తుందని చురుకుగా పని చేసుకుంటున్నారు. 


విద్యా సంస్థల అధినేత ప్రయత్నాలు                                      


విద్యా సంస్థల అధినేతగా పేరున్న  మల్క కొమురయ్య  అనే పెద్ద మనిషి నేరుగా ఢిల్లీ పెద్దలతో  మల్కాజిగిరి టిక్కెట్ కోసం సంప్రదిస్తున్నారు.  హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు.  సొంతంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి 25శాతం మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి 88 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్నారు. తన సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో మల్కాజ్‌గిరి నుంచి పోటీకి సై అంటున్నారు.  మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ సైతం మల్కాజ్‌గిరి టికెట్ పై ఆశాలు పెట్టుకున్నారు. స్థానిక నేతలు.. స్థానికేతరులు కూడా ఎక్కువ  ఆశలు పెట్టుకుంటూండటంతో  అభ్యర్థి ఎంపిక  హైకమాండ్ కు క్లిష్టంగా  మారే అవకాశం ఉంది.