TS Congress Senior Leaders :  కాంగ్రెస్ పార్టీలో తమపై కోవర్టులనే ముద్ర వేయడంపై తెలంగాణ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం అయ్యారు.  ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పేందుకు  భట్టి విక్రమార్క నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.  ఏఐసీసీ నేతలను కలిసి పిసిసి కమిటీలపై ఫిర్యాదు  చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, ప్రస్తుత రాజకీయాలపై అధిష్టానంతో చర్చించాలని నిర్ణయించారు.  కొత్తగా వచ్చిన వాళ్లకు కమిటీలలో ప్రాధాన్యం కల్పించి కష్టకాలంలో పార్టీతో ఉన్న వాళ్లను విస్మరించారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. భట్టి నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, దామోదర రాజానర్సింహ, ప్రేమ్ సాగర్ రావు ,ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, జగ్గారెడ్డి వంటి సీనియర్లు పాల్గొన్నారు. 


కమిటీల్లో వలసవాదుల వల్ల సీనియర్లకు అన్యాయం : మల్లు భట్టి విక్రమార్క 


సీనియర్,దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వుండి, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ఆచరించే వారికి పీసీసీ కమిటీల ఏర్పాటులో అన్యాయం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వలసవాదులతో అసలు కాంగ్రెస్ వాదులు నష్టపోయారన్నారు.్అనేక మంది తమ దృష్టికి తీసుకు వచ్చారని..  పిసిసి కమిటీల్లో నష్టం జరిగిన వారి గురించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చానని భట్టి విక్రమార్క తెలిపారు.  పీసీసీ కమిటీల ప్రక్రియలో తాను భాగస్వామ్యం కాలేదని .. తనకూ అసంతృప్తి ఉందని విక్రమార్క తెలిపారు.  కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్తామన్నారు.  సీనియర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కుట్ర పూరితంగా వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు...వాటిపైన సమావేశంలో చర్చించామని తెలిపారు. 


మమ్మల్ని కోవర్టులనడానికి తీన్మార్ మల్లన్న ఎవరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి 


ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించామమని.. ఇక నుండి సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తామమని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.   కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ,అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎప్పుడు ఉంటుందన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడుగా వున్నప్పుడు పదవులన్నినేనే భర్తీ చేయాలని ఎప్పుడు అనుకోలేదని.. 33 జిల్లాల డీసీసీ అధ్యక్షుల భర్తీ ప్రక్రియ సీనియర్లను అవమానించడానికే చేశారని  ఆరోపించారు. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల్లో బయట పార్టీ నుండి వచ్చిన వారే వున్నారన్నారు.  కమిటీల్లో 60 మంది టీడీపీ వారే వున్నారని.. మరో సారి త్వరలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తాము...వివరాలు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమను తీన్మార్ మల్లన్న కోవర్టులని ప్రచారం చేస్తున్నారని.. అసలు  మమ్మల్ని అనడానికి తీన్ మార్ మల్లన్న ఎవరని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.  


మేము నాలుగు పార్టీలు మారలేదు : దామోదర రాజనర్సింహ


కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై చర్చ జరిగిందని... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా ఉన్నాయని దామోదర్ రాజనర్సింహ ఆందోళన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీకి సంభందం లేని వాళ్లకు పదవులు ఇచ్చారన్నారు.  ప్రతి జిల్లాలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా మా ప్రయత్నం ఉంటుందన్నారు.  సోషల్ మీడియాలో మాపైన చెడు ప్రచారం చేస్తున్నారని.. మేము నాలుగు పార్టీలు మారలేదు...కాంగ్రెస్ లోనే వున్నామని గుర్తు చేశారు. 


సీనియర్లపై యూట్యూబ్ చానల్స్ దుష్ప్రచారం : మధు యాష్కీ 


కాంగ్రెస్ పార్టీలో వలస వచ్చిన వాళ్లకు నిజమైన కాంగ్రెస్ వాళ్లకు పంచాయతీ నడుస్తోందని సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అ్నారు.  సీనియర్లపై దుష్ప్రచారం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీకి పీసీసి తో సమానంగా భాద్యతలు వుంటాయి...కానీ సీఎల్పీని అవమానించే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయన్నారు.  అందరం కలిసి పోరాటం చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గుర్తు  చేశారు.  మాపై మీడియా చానల్స్,పేపేర్లు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.  మేము విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాము.. అధికార పార్టీకి సన్నిహితంగా వుండే వాళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 
 
కోవర్టులు అనే పదాన్ని వాడితే సహించము : జగ్గారెడ్డి 


కోవర్టులు అనే పదాన్ని వాడితే సహించబోమని..  ఎవరు రాకముందే మేము ఎంపీలు,ఎమ్మెల్యేలుగా వున్నామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.  లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వలస నాయకులు పోటీ చేయవద్దని తీర్మానం చేశారు కానీ మా మెదక్ జిల్లాలో నేను దామోదర రాజ నర్సింహా, గీతారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినందుకు మేము కోవర్టులమా అని ప్రశ్నించారు.  రాహుల్ గాంధీ అంటే ఇష్టంతోనే భారత్ జోడో పాదయాత్రకు ఎంత డబ్బు ఖర్చు పెట్టామో వలస నాయకులకు తెలుసా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  మరియమ్మ విషయంలో అనుమతి తీసుకుని సీఎంను కలిశాము...కానీ వలస నేతలు,సోషల్ మీడియా చానల్స్ కోవర్టులు అని ముద్ర వేశారని ఆరోపించారు.