Jogi Ramesh : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ లు ఈ నియోజకవర్గం కేంద్రంగానే పోరాడుతున్నారు. జోగి రమేష్ మైలవరం నుంచే పోటీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన సిట్టింగ్ సీటులో మళ్లీ పోటీ చేయాలని వసంత కృష్ణప్రసాద్ ఆశపడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల్లో అనూహ్యంగా పెడనకు వెళ్లిన జోగి రమేష్ !
మంత్రి జోగి రమేష్ పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయన నియోజకవర్గం మైలవరం. గతంలో ఆయన మైలవరంలోనే చివరి క్షణం వరకూ పని చేశారు. అయితే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను పార్టీలో చేర్చుకున్న సీఎం జగన్ ఆయనకు మైలవరం ఆఫర్ చేశారు. జోగి రమేష్‌ను పెడనకు పంపారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జోగి రమేష్.. తన పాత నియోజకవర్గ మైలవరం నుంచే పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు పదే పదే ఘర్షణలకు దిగుతున్నాయి.
జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్‌లతో హైకమాండ్ చర్చలు
ఇరువురు నేతలను పిలిచి విడి విడిగా సమావేశం అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు యత్నించారు. అయినా ఇరువురు నేతలు సెటిల్ మెంట్ కు అంగీకరించలేదు.తాను జగన్ తో మొదటి నుండి నడిచానని ఇప్పుడు మంత్రిగా ఉన్న తనను వసంతతో రాజీపడమంటే తన మనస్సుకు అంగీకారం గా లేదని జోగి నేరుగానే చెప్పేశారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నారు. ఇక వసంత కూడ తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారంటున్నారు. తాను పార్టీలో కష్టపడి పని చేసుకుంటూ భారీగా ఖర్చు పెట్టి పార్టీని కూడా గెలిపించానని.. దేవినేని ఉమాను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపిస్తున్నానని ఆయన చెబుతున్నారు. నియోజకవర్గంలో జోగి రమేష్,ఆయన అనుచరులు చేస్తున్న అరాచకాలు, పార్టీకి చేస్తున్న నష్టం వంటి వివరాలను పూర్తి ఆధారాలతో వసంత పార్టి పెద్దల ముందు పెట్టారని అంటున్నారు. తనకు చెడ్డపేరు తెచ్చేందుకు జోగి వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారని.. దాని వల్ల పార్టీనే ఎక్కువ నష్టపోతోందని వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు.
సమీక్షలో టిక్కెట్ పై ఎవరికీ హామీ ఇవ్వని సీఎం జగన్
నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ తాజాగా మైలవరం నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మైలవరం ఇష్యూలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇచ్చిన నివేదిక అంశాలను పరిశీలించిన జగన్,, వసంత ను కూడ ఇదే వ్యవహరం పై ఆరా తీశారని చెబుతున్నారు. గతంలో నే జోగి కలిగిస్తున్న ఇబ్బందులను గురించి జగన్ ను ప్రత్యేకంగా కలసి వివరాలను వసంత కృష్ణ ప్రసాద్ ప్రసాద్ అందించారు. జగన్ మరో సారి వసంత ను అభిప్రాయం అడిగి తెలసుకున్నారని చెబుతున్నారు. వసంత కూడ తాను పార్టి పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు,అందులో జోగి అనుచరులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు,సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వవరాలను అందించారని అంటున్నారు. మీరు తీసుకునే నిర్ణయం ఫైనల్,దానికే కట్టుబడి ఉంటానని వసంత చెప్పినట్లుగా తెలు్సతోంది.
మైలవరంలో పోటీకే జోగి రమేష్ ప్రయత్నాలు
జోగి రమేష్ తాను ముందుగా ప్రాతినిధ్యం వహించిన మైలవరం నుండి జోగి సింగల్ గానే పెడన వెళ్లారు.జోగి కుటుంబ సభ్యులు, అనుచరులు, ప్రధాన శిష్యులంతా మైలవరంలోనే ఉండి ఎన్నికల సమయంలో వైసీపీ విజయానికి పని చేశారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ శాసన సభ్యుడిగా విజయం సాదించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్, పార్టీ కోసం వసంత విజయం కోసం పని చేసిన జోగి కుటుంబాన్ని, ఆయన వర్గాన్ని కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. స్దానికంగా ప్రతి మండలానికి వసంత తన వర్గంలోని వ్యక్తులను ఇంచార్జ్ గా నియమించారు. దీంతో జోగి ఫ్యామిలికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రతిపక్షం లో ఉండగా తమ పై దాడి చేసిన వారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ తో పాటుగా స్దానిక అధికార యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొవటం, జోగి వర్గం కు మింగుడు పడటం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జోగి పొగోట్టుకున్న చోటనే వెతుక్కోవాలని మైలవరం పైనే శ్రద్ద పెట్టారని సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.