Senior leader Venugopalachari joined the Congress party :  బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సముద్రాల వేణుగోపాల చారి... వాజ్‌పెయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో  తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా ఆయనను 2022 డిసెంబర్‌లో  నియమించారు. 2023 జనవరి 5న తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారే వరకూ ఆ పదవిలోనే ఉన్నారు.  


నిర్మల్ జిల్లాకు చెందిన వేణుగోపాలా చారి                                        


 నిర్మల్‌ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి 1985 నుంచి 1996 వరకు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతూనే 1996లో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ మంత్రి వర్గంలో సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ, వ్యవసాయశాఖల మంత్రిగా సముద్రాల బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో మరోసారి ఎంపీగా గెలిచి వాజపేయి ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ఎంపీగా హ్యాట్రిక్‌ విజయం సాధించి 2004 వరకు అదే పదవిలో కొనసాగారు. 


2004 నుంచి రాజీయాల్లో వెనుకబడిన చారి                                    


2004లో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ముధోల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. 2013లో బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత 2014లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా సముద్రాలను సీఎం కేసీఆర్‌ నియమించారు. ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతున్నారు. పార్టీకి భవిష్యత్ ఉంటుందో లేదోన్న ఆందోళనతో  ముందుగానే ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు.  


కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం                           


కేంద్ర మంత్రిగా పని చేసిన వేణుగోపాలా చారి చివరికి నామనేటెడ్ పోస్టులకు పరిమితయ్యారు. ప్రతీ సారి ఎన్నికల సమయంలో తనకు టిక్కెట్ లభిస్తుందని ఆయన ఆశిస్తూ ఉంటారు. ప్రతీ సారి నిరాశే ఎదురవుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అనుచరగణం ఉన్న  వేణుగోపాలా చారి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.